- సభలో ౫ సంతాప ప్రతిపాదనలు
- రెండు నిమిషాల పాటు మౌనం
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. మన్మోహన్ దేశానికి చేసిన సేవలను కొనియాడు తూ.. ఆయన మరణం దేశానికి లోటని సం తాపం ప్రకటించింది.
ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్ట గా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేందరూ మాట్లాడారు. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని, హైదరాబాద్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మన్మోహన్ పేరు పెట్టాలని సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.
సంతాప ప్రతిపాదన -1
మన్మోహన్‌సింగ్ మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ర్టంలోని ఘా గ్రామంలో మన్మోహన్ జన్మించారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యను పంజాబ్‌లోనే పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఎకనమిక్స్) చేశారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి ఎకనమిక్స్ ట్రైపోస్ పట్టా పొందారు. ఆక్స్‌ఫర్డ్ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఫ్యాకల్టీగానూ పని చేశారు.
సంతాప ప్రతిపాదన-2
1991 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 మే 22 నుంచి 2014 మే 26 వరకు పదేళ్లపాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీ కాలం లో దేశానికి ఎన్నో కీలకమైన విజయాలను అందించారు. మన్మోహన్ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటి గొప్ప చట్టాలు రూపుదిద్దుకొన్నాయి.
సంతాప ప్రతిపాదన -3
పాకిస్తాన్‌తో శాంతి చర్చలు చేపట్టి ఇరు దేశాల మధ్య సయోధ్యకు మన్మోహన్ కృషిచేశారు. 2008లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు అనేక సాహసోపేత సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలిపారు. అత్యధిక జీడీపీ వృద్ధి రేటును నమోదయ్యేలా కృషిచేశారు. 1971లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారునిగా, 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారునిగా నియమితులయ్యారు. 1976--80లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 1982--85లో ఆర్బీఐ గవర్నర్‌గా, 1985--87లో ప్రణాళికాసంఘం డిప్యూటీ చైర్మన్‌గా, 1987--90లో జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్‌గా, 1990-91లో ప్రధానమంత్రి సలహాదారునిగా, 1991లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైైర్మన్‌గా పని చేశారు.
సంతాప ప్రతిపాదన -4
1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక చరిత్రలో మన్మోహన్ కీలకపాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధా నం ఆవిష్కరణలో ఆయన పాత్ర ప్రపంచ గుర్తింపుపొందింది. 1987లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోదైన పద్మ విభూషణ్, 2002లో అత్యుత్తమ పార్లమెంటేరి యన్ అవార్డు, 2010లో వరల్డ్ స్టేట్స్‌మెన్‌తో సహా మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ సహా అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు.
సంతాప ప్రతిపాదన -5
అనేక అంతర్జాతీయ సదస్సులకు మన్మోహన్‌సింగ్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహిం చారు. ప్రధానిగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో నెగ్గి రాష్ర్టపతి ఆమోదం పొందేవరకూ సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన మహానేత సేవలు సదా చిరస్మరణీయమని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. మన్మోహన్ మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.