12-03-2025 12:57:39 AM
నిధులు సాధించేనా?
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జిల్లా ఎమ్మెల్యేలందరూ విపక్షమే
మేడ్చల్, మార్చి 11 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎమ్మెల్యేలు గళం విప్పి జిల్లాకు నిధులు సాధించాల్సిన అవసరం ఉంది. ఆయా నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలలోనూ విపక్ష ఎమ్మెల్యేలే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారు. ఉప్పల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ఎన్నిక కాగా, కుతుబుల్లాపూర్, కూకట్ పల్లి ఎమ్మెల్యేలు వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావు వరుసగా మూడుసార్లు గెలుపొందారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ బీ ఆర్‌ఎస్ విప్ గా కొనసాగుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఒక పర్యాయం ఎంపీగా కూడా పనిచేశారు. జిల్లాలో పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉంది. కేవలం మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రమే గ్రామీణ ప్రాంతం ఉంది. జిల్లాలో వివిధ పనులు పెండింగ్లో ఉన్నాయి. బోడుప్పల్, పిర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో వరద నీరు వెళ్లడానికి చేపట్టిన పనిని అర్థంతరంగా నిలిపివేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాం లో వంద పడకల ఆసుపత్రికి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనుల ప్రారంభం కాలేదు.
కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల ర్యాలీ కూడా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. జిల్లా అధికారులు ఇప్పటివరకు ముందస్తు చర్యలు తీసుకోలేదు. మున్సిపాలిటీలలో ప్రధాన రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి. డ్రైనేజీ సమస్య కూడా ఉంది. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.