సిద్ధిపేట: తన అధికార నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమని మండి పడ్డారు. తాళాలు పగులగొట్టి .. ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడిని ఆపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుందని ఎద్దెవా చేశారు. ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే పౌరులకేం భరోసా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రేమ బజారులో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారు: కేటీఆర్
దాడి ఘటన పై భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ ఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని, ఇపుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని .. సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు. మరో పోస్టులో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి.. ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు అని ప్రశ్నించారు. ప్రేమ బజారులో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకునే వ్యక్తికి ఇవి కనిపించడం లేదా అని కేటీ ఆర్ నిలదీశారు.
అసలేం జరిగిందంటే..
సిద్ధిపేటలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. రైతు రుణమాఫీ అయ్యింది.. హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో భారాస శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించడానికి వచ్చారు. రోడ్డు పైకి అర్ధరాత్రి భారీగా కాంగ్రెస్, భారాస కార్యకర్తలు చేరుకున్నారు. వారి పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.