20-04-2025 12:14:13 AM
ఐదుగురు నిందితుల అరెస్ట్..
రెండు దేశీయ పిస్తోళ్లు, ఐదు రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం..
కార్వాన్ (విజయక్రాంతి): ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తిని ప్రత్యర్థి వర్గం మట్టు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లంగర్ హౌస్ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. హత్యాయత్నం చేసిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి -రెండు దేశీయ పిస్తోళ్లు, ఐదు రౌండ్ల బుల్లెట్స్, ఆరు మొబైల్ ఫోన్ లు, ఒక క్వాలిస్ వాహనంను స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధికి, సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందే శ్రీనివాస్ రావు లు శనివారం సౌత్ వెస్ట్ జోన్ డిసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా నమోదయ ఉన్నటువంటి హైమద్ అలీ ఖాన్ ను మట్టు పెట్టేందుకు ఏడుగురు సభ్యులు గల ముఠాను సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లంగర్ హౌస్ పోలీసులు దాడి జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హైమద్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని, వ్యాపార లావాదేవీల్లో వచ్చిన మనస్పర్ధలతో 2020లో ఫయాజుద్దీన్ అనే వ్యక్తిని హత్య చేశాడన్నారు. ఈ క్రమంలో హైమాద్ అలీ ఖాన్ పై కక్షగట్టి హత్యా యత్నం చేసిన లంగర్ హౌస్ పెన్షన్ పురకు చెందిన సయ్యద్ అప్రోచ్ తో పాటు అతని అనుచరులు మమ్మద్ షా ఓవైస్ (లంగర్ హౌస్ ఇందిరా నగర్), సయ్యద్ ఇంతియాజ్ అలీ ( ఎం సి హెచ్ కాలనీ హుమాయున్ నగర్ మెహిదీపట్నం ), మహమ్మద్ అర్బాజ్ ఖాన్ (ఖాదర్ బాగ్ ఇందిరానగర్ లంగర్ హౌస్), సయ్యద్ ఫిర్దోస్ (లంగర్ హౌస్ పెన్షన్ పుర) లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జాబెర్ తో పాటు మహ్మద్ జమీల్ అలియాస్ జమ్మూ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.