21-02-2025 03:16:44 PM
వైద్యుడిని హత్య చేసిన దుండగులు
వరంగల్ ఉర్సుగుట్ట రోడ్డులో ఘటన
జనగామ,(విజయక్రాంతి): నిర్మానుష్య దారిలో కొందరు దుండగులు కారులో వెళ్తున్న ఓ డాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. కారును అడ్డగించి రాడ్లతో కొట్టి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన వరంగల్‌లోని ఉర్సుగుట్ట–భట్టుపల్లి రోడ్డులో జరిగింది. కాజీపేట సిద్దార్థనగర్ కాలనీకి చెందిన డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి(36) వరంగల్ హంటర్ రోడ్డులో గల గ్రీన్ఉడ్ స్కూల్ సమీపాన ఓ అపార్ట్మెంటులో నివాసముంటున్నారు. గురువారం రాత్రి 9:30 గంటలకు కాజీపేటలోని తన క్లినిక్ ముగించుకుని కారులో తన నివాసానికి బయల్దేరారు.
ఈ క్రమంలో ఉర్సుగుట్ట – భట్టుపల్లి మధ్య మైసమ్మగుడి సమీపంలో బైక్‌పై ముగ్గురు యువకులు డాక్టర్ కారును ఢీకొట్టడంతో సుమంత్‌రెడ్డి కారును ఆపాడు. దీంతో ఒక్కసారిగా ఆయనను ముగ్గురు దుండగులు కారులోంచి దింపి తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ ప్రమాదంలో సుమంత్ రెడ్డి తల వెనకాల తీవ్రం గాయమై రక్తస్రావమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను 108లో ఎంజీఎంకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు ధృవికరించారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైద్యుడి హత్యకు కారణాలు ఏంటనే విషయాలపై ఆరా తీస్తున్నారు.