- ఏడాదిగా ఎదురుచూస్తున్న పాడి రైతులు
- జనగామ జిల్లాలో పాల బకాయిలు రూ.10 కోట్లు
- పశువులను సాదలేక అమ్ముకుంటున్న దుస్థితి
జనగామ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): డెయిరీ రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. ఓ వైపు పాల బిల్లులు రాక.. మరో వైపు పశువులకు దాణా కొనలేక కొట్టుమిట్టాడుతున్నారు. పాలుపోని స్థితిలో పశువులను అమ్మేసి పాడి పోషణకు దూరమవుతున్నారు.
జనగా మ జిల్లాలో పాల రైతులకు విజయ డెయిరీ సుమారు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. పాల ఉత్పత్తిలోనే జనగామ విజయ డెయిరీ ప్రథమ స్థానంలో నిలిచి మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది.
కరువు నేలగా పేరున్న ఈ ప్రాంతంపై కొన్నేళ్లుగా పాల వెల్లువ పోటెత్తుతోంది. అంతా బాగానే ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించ డంలో విజయ డెయిరీ విఫలమవుతోంది. దీంతో క్రమంగా రైతులు పాడికి దూరమ య్యే ప్రమాదం నెలకొంది.
అమ్మకానికి పశువులు
ఏడాదిగా పాల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. పశు పోషణ భారంగా మారి రైతులు పశువులను అమ్ముకునే దుస్థితి నెలకొంది. ఇప్పటికే 25 శాతం మంది పాడి రైతులు తమ పశువులను అమ్ముకున్నారు. ఓ వైపు మార్కెట్‌లో దాణా ఖర్చులు పెరిగిపోతుండడం, మరోవై పు బిల్లులు సకాలానికి చెల్లించకపోవడంతో పశువులను అమ్మేసి పాల ఉత్పత్తికి దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా బల్క్ మిల్క్ పర్చేస్ సెంటర్(బీఎంపీసీ)ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. జనగామ జిల్లాలో ఇదివరకు 16 బీఎంపీసీలు ఉండగా.. ప్రస్తు తం వాటి సంఖ్య ఆరుకు తగ్గింది.
సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్
పాడి రైతులు వివిధ బ్యాంకుల్లో ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకున్నారు. గతంలో కిస్తీలు సమయానికి కట్టేవారు. ఏడాది నుంచి విజయడైరీ బిల్లులు చెల్లించకపోవడంతో సరిగ్గా కిస్తీలు కట్టక తమ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతిందని పాడి రైతులు చెబుతున్నారు. దీంతో మరోసారి రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అందుకే పశువులను అమ్మేసి అప్పు లు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పాడి రైతుల బిల్లు లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నిత్యం ౩౦ వేల లీటర్ల సేకరణ
జనగామ జిల్లాలో రోజుకు 26 వేల లీటర్ల నుం చి 30 వేల లీటర్ల వరకు విజయ డెయిరీ పాలను సేకరిస్తోంది. 300 సొసైటీల ద్వారా సుమారు 600 మంది రైతు లు నిత్యం పాల సరఫరా చేస్తున్నారు. లీటర్ ఆవు పాలకు రూ.40.46 పైసలు, గేదె పాలకు రూ.45 చెల్లిస్తున్నారు. గతం లో బిల్లులు ౧౫ రోజులకోసారి చెల్లించేవారు. కానీ, 2023 నవంబర్ నుంచి బిల్లులను పెండింగ్‌లో ఉంచారు.
దీంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారుతోంది. సుదీర్ఘకాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు చాలాసార్లు రోడ్డెక్కారు. వివిధ గ్రామాల్లో ఆందోళనలు కూడా చేశారు. కొన్ని నెలల క్రితం లాలాపేటలో విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పలు పాల శీతలీకరణ కేంద్రాల వద్ద ఖాళీ పాల డబ్బాల తో నిరసనలు తెలిపారు.
సబ్సిడీపై దాణా ఇవ్వాలి
పాడి రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో దాణా ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా షెడ్లు నిర్మించి ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా పాలకు ధర ఇవ్వాలి. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10 కోట్ల బిల్లులను వెంట నే క్లియర్ చేయాలి. ఉమ్మడి ఏపీలో పశువులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. తెలంగాణ వచ్చిన వెంటనే దానిని తొలగించారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలి.
సాదం రమేశ్, విజయ డెయిరీ
పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్