calender_icon.png 20 September, 2024 | 4:12 PM

సాయం కోసం పడిగాపులు

20-09-2024 12:43:46 AM

  1. వరద సాయం అందక.. అధికారులు పట్టించుకోక..
  2. ఖమ్మంలో బాధితుల వెతలు వర్ణణాతీతం
  3. వందలాది మంది అర్హుల ఖాతాల్లో జమ కాని సాయం
  4. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సర్కార్ ఆదేశం
  5. ఒక్కరోజే బల్దియాకు 700 దరఖాస్తులు

ఖమ్మం, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల బాధలు చెప్పనలవికాకుండా ఉన్నాయి. వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు కనీసం ప్రభుత్వం అందించే వరద సాయమైనా సక్రమంగా అంద డం లేదు. అధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదు. ప్రతి వరద బాధిత కుటుం బం ఇంటికి వెళ్లి, సర్వే చేపట్టి రూ.16,500 చొప్పున వారి ఖాతాలో సొమ్ము చేశామని అధికారులు చెప్తున్నారు.

కానీ బాధితులు మాత్రం తమకింకా సాయం అందలేదంటున్నారు. సాయం కోసం ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నష్టం అంచనాకు సర్కార్  ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసి వరద ప్రభావ ప్రాంతాలైన బొక్కలగడ్డ, వేంకటేశ్వరనగర్, ప్రకాశ్‌నగర్, కరుణగిరి రాజీవ్ గృహ కల్ప, ఆర్టీసీ కాలనీ, సాయి నగర్, జూబ్లీ క్లబ్ పరిసరాలు, హనుమాన్ టెంపుల్ తదితర ప్రాంతాల్లో సర్వే చేయించింది. ఆస్తినష్టం వివరాలను సేకరించి, ఫొటోలు సైతం తీయించింది.

బాధితుల బ్యాంక్ ఖాతా వివరాలనూ సేకరించింది. ఖమ్మం నగరవ్యాప్తంగా 9,279 ఇండ్లు, ఖమ్మం రూరల్ పరిధిలో 2,815 ఇండ్లు దెబ్బతిన్నట్లు తేల్చింది. తాజాగా బాధితులందరి ఖాతాల్లో పరిహారం జమ చేసినట్టు ప్రకటించినప్పటికీ సాయం అందలేదంటూ వేలాది మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అధికారులు తమ ఇంటిని సర్వే చేపట్టలేదంటున్నారు. ఎవరెవరో నాయకులు సూచించిన పేర్లను సర్వే బృందం రాసుకుపోయిందని ఆరోపిస్తున్నారు.

నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ..

ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశాల మేరకు అధికారులు ఖమ్మంలోని నగర కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా నాలుగు  కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. బాధితులు గంటల తరబడి లైన్లో నించుని సాయం కోసం దరఖాస్తులు అందజేస్తున్నారు. ‘వరదల్లో మా ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. మా కుటుంబం రూ.2 లక్షల వరకు నష్టపోయింది. సర్కార్ నుంచి పైసా సాయం అందలేదు.’ అని గురువారం ఓ బాధితుడు వాపోయాడు. ‘మా ఇల్లు వరదలకు కొట్టుకుపోయింది.

మాకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. పొరుగింటి వారి ఇల్లు బాగానే ఉంది. కానీ వారి కుటుంబానికి సాయం అందింది. ఇదెక్కడి న్యాయం?’ అని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎవరిని కదిలించినా సాయం అందలేదనే సమాధానమే వస్తున్నది. ఒక్కరోజే సాయం కోసం 700 మందికి పైగానే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన వరద బాధితులందరికీ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సాయం పొందిన వారే మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు

మన్నేరు వరద బాధితుల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశాం. మాకు అందిన 90 శాతం దరఖాస్తుదారుల్లో ఇంతకు ముందు సాయం పొందిన వారే తిరిగి దరఖాస్తున్నారని తెలిసింది. కొందరైతే ఒక కుటుంబ యజమానులు కాకుండా వారి పిల్లలు, సన్నిహుతులతో దరఖాస్తు చేయిస్తున్నారు. మరికొందరైతే వేర్వు రు చిరునామాలతో దరఖాస్తు చేయిస్తున్నారు. నిజమైన అర్హులను గుర్తిం చి వారికి న్యాయం జరిగేలా చూస్తాం.

 నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య