calender_icon.png 22 January, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్విన్ మాస్.. జడ్డూ క్లాస్

20-09-2024 12:00:00 AM

శతకం బాదిన లోకల్ బాయ్

  1. జైస్వాల్, జడేజా హాఫ్ సెంచరీలు
  2. భారత్, బంగ్లా తొలి టెస్టు

* దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన భారత్ మ్యాచ్ ఆరంభంలోనే టపాటపా మూడు వికెట్లు కోల్పోయింది. ఎర్రమట్టి పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ బంగ్లా పేసర్లు చెలరేగిపోతుంటే టీమిండియా పని ఖతం అయినట్లే అని భావించాం. 150 పరుగుల లోపే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను లోకల్ బాయ్ అశ్విన్ అజేయ శతకంతో ఆదుకున్నాడు. మొత్తం మీద అశ్విన్ మాస్.. జడ్డూ క్లాస్ ఆటతీరుతో బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు పటిష్టస్థితిలో నిలిచింది.

4 ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడం అశ్విన్‌కు నాలుగోసారి. వెటోరి ఐదు శతకాలతో తొలి స్థానంలో ఉన్నాడు.

చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదట తడబడ్డా ఆపై నిలబడింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అశ్విన్ (102 నాటౌట్), జడేజా (86 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హస న్ మహ్ముద్ 4 వికెట్లతో చెలరేగగా.. నహిద్ రానా, మెహది హసన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇటీవలే  పాకిస్తాన్‌ను సొంత గడ్డ మీద ఓడించి మంచి జోష్‌లో ఉన్న బంగ్లా కుర్రాళ్లు టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్నారు. ఎర్రమట్టి పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ భారత టాపార్డర్‌ను కకావికలం చేశారు. టాపార్డర్‌తో పాటు మిడిలా ర్డర్ కూడా చేతులెత్తేసిన వేళ.. లోయర్ ఆర్డర్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయంగా 195 పరుగులు జోడించడం విశేషం.

టాస్‌తో మొదలు... 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. ఫోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ కాసేపటికే హసన్ మహ్మద్ బౌలింగ్‌లో శాంటోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గిల్  పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ జైస్వాల్ (56)కు పంత్ తోడయ్యాడు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం పంత్ (39) ఔట్ కాగా.. అర్థసెంచరీ చేసిన కాసేపటికే జైస్వాల్ పెవిలియన్ చేరాడు. రాహుల్ (16) ఔట్‌తో 43 ఓవర్లు ముగిసే సరికి భారత్ 149/6 వద్ద నిలిచింది. 

ఆదుకున్న అశ్విన్, జడ్డూ

ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. 179/6తో భారత్ టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం అశ్విన్, జడేజాలు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడితో చివరి సెషన్‌లో టీమిండియా 32 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే అశ్విన్ టెస్టుల్లో ఆరో సెంచరీ బాదగా.. మరో ఎండ్‌లో జడేజా అర్థశతకం సాధించాడు. ఇక స్పిన్‌కు అనుకూలమైన చెన్నైలో తొలిసారి పేసర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్లు కోల్పోగా అందులో ఐదు వికెట్లు సీమర్లకే పడడం విశేషం.