calender_icon.png 16 November, 2024 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వారావుపేట అతలాకుతలం

20-07-2024 03:54:42 AM

  1. 500 మీటర్ల మేర పెద్దవాగుకు గండి
  2. వందలాది ఎకరాల వరి పంటను ముంచిన వరద
  3. నాట్లు వేయని సుమారు 400 ఎకరాల్లో ఇసుక మేటలు
  4. విద్యుత్ స్తంభాలు నేలవాలి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
  5. రాత్రంతా అంధకారంలోనే ముంపు గ్రామాల ప్రజలు
  6. సురక్షిత ప్రాంతాలకు సుమారు 2 వేల కుటుంబాలు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (విజయక్రాంతి): నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వాగు కట్టను పటిష్టపరచకపోవడం, ప్రాజెక్ట్‌కు సంబంధించిన మూడు గేట్లలో ఒకటి మరమ్మతులకు గురికావడం.. కారణం ఏదైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం రాత్రి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ ఎడమకాలువ వైపు కట్టకు 500 మీటర్ల మేర గండిపడింది. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవెల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట, గ్రామాల్లో పాక్షిక పంట నష్టం సంభవించగా, ఏపీలోని వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్త పూచిరాల, అల్లూరి నగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయిలో ఎక్కువ నష్టం సంభవించింది.

నష్టం ఇలా..

వరద ఒక్కసారిగా సాగులో ఉన్న పంటల్లోకి వెళ్లింది. నాటువేసిన పొలాల్లో వరద చేరడంతో పంటంతా నేలకొరిగింది. నాటు వేయడానికి సిద్ధంగా ఉన్న సుమారు 400 ఎకరాల్లో భారీగా ఇసుక మేట వేసింది. దీంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరద తాకిడికి అశ్వారావుపేట వేలురుపాడు వెళ్లే మార్గంలో రోడ్డు దెబ్బతిన్నది. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సుమారు 16 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాత్రంగా అంధకారంలోనే ఉన్నారు.

శుక్రవారం ఉదయం విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. జోరు వానలోనూ మరమ్మతులు కొనసాగించి గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నీరంతా బయటకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో చుక్కనీరు లేకుండాపోయింది. ప్రాజెక్టు పరిధిలో విపత్తు సంభవించడం ఇది రెండో సారి. 25 సంవత్సరాల క్రితం ఇప్పటిలాగానే ప్రాజెక్ట్‌కు గండిపడినట్లు స్థానికులు చెప్తున్నారు. 15 ఏళ్ల నుంచి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయలేదని, ఈ కారణంతోనే ప్రాజెక్ట్‌కు గండిపడిందంటున్నారు. వరద ముంపు తప్పించేందుకు అధికారులు సుమారు 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నిధుల లేమి కారణంగానే..

ప్రాజెక్టు పరిధిలో సుమారు 16 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాల జాబితాలో ఆంధ్రాలో కలిశాయి. దీంతో ఆంధ్రా పరిధిలో 14 వేల ఎకరాల ఆయకట్టు వెళ్లగా, తెలంగాణ పరిధిలోని అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి, నారాయణపురం, కొత్తూరు, మేడిపల్లి,మాదారం గ్రామాల్లో ఉంది. 2,360 వేల ఎకరాలు మిగిలింది. ప్రాజెక్టు తెలంగాణలో ఉండి, ఆయకట్టు ఆంధ్రాలో ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు ఇవ్వలేదనే ఆరోపణలు వున్నాయి. భద్రాద్రి జిల్లా నీటిపారుదలశాఖ అధికారుల ఎన్నిసార్లు ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది.

నిధులు లేకపోవడంతో ఇక్కడి నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు పరిధిలో పూడిక తీయలేదు. కనీసం వానకాలం ప్రారంభం కావడానికి ముందే ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేస్తే బాగుండేదనే అభిప్రాయడం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.  ప్రాజెక్టు కాలువలు సైతం దెబ్బతినడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు గండి పడటంతో సుమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ మరమ్మతులు, గండి పూడ్చి, వాగు కట్ట పటిష్టం చేసేందుకు రూ.100 కోట్ల అవసరమవుతోందిన నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

పంట నష్టపోతున్నాం..

ఆయకట్టు కింద రైతులు వరి నాట్లు ప్రారంభించారు. మరికొందరు నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేశారు. పెదవాగు ప్రాజెక్టుకు గండిపడి పొలాల్లోకి భారీగా వరద చేరింది. దీంతో నాట్లు పూర్తయిన పొలాలు దెబ్బతిన్నాయి. నాట్లు వేయని పొలాల్లో భారీగా ఇసుక మేట వేసింది. ఇసుక మేటను తొలగించడం అంత సులభం కాదు. వందల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయి. రైతులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. 

 నాగరాజు, 

గ్రామస్తుడు, గుమ్మడవెల్లి

భారీ వర్షాలే కారణం.. 

ఆంధ్రా మండలాల్లో గురువారం ఏకంగా 30 సెంమీ వర్షం కురిసింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తినా 40 క్యూసెక్కుల నీరే బయటకు పోతుంది. కానీ సుమారు 60 నుంచి 70 క్యూసెక్కుల వరద ప్రాజ క్టులోకి రావడంతో వాగుకు గండి పడింది. దీంతో రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

శ్రీనివాసరెడ్డి, 

ఎస్‌ఈ, నీటిపారుదలశాఖ