calender_icon.png 25 October, 2024 | 5:53 AM

అష్ట దిగ్బంధనంలో అశోక్‌నగర్

15-07-2024 12:26:29 AM

నిరుద్యోగులపై పోలీసుల నజర్

ఆందోళనలు జరగకుండా ముందస్తు అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై14 (విజయక్రాంతి): గ్రూప్ 2, 3, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని శనివారం నిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం వేకువజాము వరకు ఆందోళన కొనసాగడంతో పోలీసులు నిరుద్యోగులపై నజర్ పెట్టారు. శనివారం జరిగిన ఆందోళనలను నియంత్రించడంలో విఫలమయ్యారనే విమర్శలు రావడంతో ఆదివారం పోలీసులు అశోక్‌నగర్‌ను అష్టదిగ్భందనం చేశారు.

చిక్కడ్‌పల్లిలోని సిటీసెంట్రల్ లైబ్రరీ , ఆర్టీసీ క్రాస్‌రోడ్ , అశోక్‌నగర్ జంక్షన్ల వద్ద చిక్కడపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి, దోమలగూడ, సైఫాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నిరసనకు ప్రయత్నించిన 25మంది ఆందోళనకారులను, సాయంత్రం మరో 10మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఓయూలో ముందస్తు అరెస్ట్‌లు

నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నందున పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయమే ఓయూలోని పలు హాస్టళ్లలోకి  పోలీసులు వెళ్లారు. ఓయూ బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య సహా బీఆర్‌ఎస్వీ నాయకులు రమేష్, సాయిలును అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. గ్రూప్ 2, 3, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేసే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య ప్రభుత్వాని హెచ్చరించారు.