- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత
ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఆశాల రాష్ట్ర బస్సుజాత ముగింపు సభ
ముషీరాబాద్, డిసెంబర్ 31 : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 26వేల మంది ఆశాలకు రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనాన్ని ఇవ్వాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఆశావర్కర్‌ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఫిక్స్‌డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆశాల రాష్ట్ర బస్సు జాత ముగింపు సభ జరిగింది.
ఈ సభకు వందలాది మంది ఆశావర్కర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం స్కీంలో భాగంగా గత 19 ఏండ్లుగా రాష్ట్రంలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వీరంతా మహిళలు బడుగు బలహీనవర్గాలకు చెందినవారేనన్నారు. రాత్రనక, పగలనక నిరంతరం ప్రజల కు ఆరోగ్య సేవలందిస్తున్నారని అన్నారు. కానీ ఆశాలకు చెల్లించేది పనిని బట్టి పారితోషికమని అన్నారు.
అహర్నిషలు కష్టిస్తున్న ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని గత కొన్నేండ్లుగా పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 15 నుంచి 31 వరకు బస్సు యాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయల, ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి, సునీత, బాలమణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, జే వెంకటేశ్, భూపాల్, రమేశ్, ఈశ్వర్ రావు, సోమన్న, ప్రసాద్, రమ, సుధాకర్ పాల్గొన్నారు.