calender_icon.png 18 November, 2024 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఆషాఢ బోనాలు

05-08-2024 01:35:08 AM

మేడిపల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆదివారం పీర్జాదిగూడ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల పం డుగ నిర్వహించారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని పలు అమ్మవార్ల ఆలయాల్లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మేయర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనం సమర్పించారు.

గోల్కొండ కోటలో...

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి) : తెలంగాణలో జూలై 7న ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు నెలరోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక, మహంకాళీ అమ్మవార్లకు చివరి బోనం, వస్త్రాలు సమర్పించి చివరి పూజలు నిర్వహిం చారు. పూజల్లో గోల్కొండ బోనాలు ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద మహేష్‌కుమార్, ఆలయ కమిటీ సలహా దారు రాజేశ్వర్‌రావు, ఈవో శ్రీనివాస్ రాజు, కులవృత్తుల సంఘం నాయకులు సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

నాగోల్, హయత్‌నగర్ డివిజన్లలో..

ఎల్బీనగర్, ఆగస్టు 4: నాగోల్, హయత్‌నగర్ డివిజన్లలో ఆదివారం బోనాల ఉత్స వాలు ఘనంగా జరిగాయి. నాగోల్ డివిజన్‌లోని పలు  ఆలయాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు చేశారు. పోచమ్మ ఆలయంలోని అమ్మవారిని ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.

బోనాల పండుగను ఘనంగా నిర్వహించాం : మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో యావత్ దేశం అకలిని తీర్చే బోనంలా తెలంగాణ పాడిపంటలు, సిరిసంపదలతో వర్థిల్లాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆషాడ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రజలు అమ్మవార్లను గుండెలనిండా దర్శించుకుని, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని అన్నారు. జూలై 7న గోల్కొండ జగదాంభిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం బోనం సమర్పణతో విజయవంతంగా ముగిశాయని తెలిపారు. నెలరోజుల పాటు మహానగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడిందన్నారు. బోనాల ఉత్సవాలను విజయవంతం చేయడంలో శ్రమించిన అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడంతో రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని, సురక్షితంగా ఇండ్లకు చేరుకున్నారన్నారు. అధికారులు, బోనాల ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమీక్ష సమావేశాలు సత్ఫలితాలనిచ్చాయని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది ఉత్సవాలను మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు.

ఈ సంవత్సరం బోనాల వేడుకలు, మొహర్రం పండగల సందర్భంగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా అమ్మవార్ల అంబారీ ఊరేగింపు, బీబీకా ఆలం ఊరేగింపునకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడి నుంచి ఏనుగును తెలంగాణకు తరలించిన తీరును గుర్తుచేశారు. ఉత్సవాల కోసం గతేడాది కంటే రూ.5 కోట్లు అదనంగా రూ.20 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.