10-12-2024 12:41:59 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఎన్నికలపుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట సోమవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వేతనాలను రూ.18వేలకు పెంచుతామని చెప్పి ఏడాది పూర్తియనా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారంతా అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో ఆశా కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఈ క్రమంలో ఆశా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే సమయంలో సుల్తాన్‌బజార్ సీఐపై ఒక ఆశ వర్కర్ చేయిచేసుకున్నారు. ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్‌చారి , పోలీసులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, నోరు పారేసుకున్నారని ఆశా వర్కర్లు ఆరోపించారు.
వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించే క్రమంలో ఇద్దరు ఆశా కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. వెంట నే వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ.రాంబాబుయాదవ్ వారికి మద్దతు తెలిపారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ .. ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్‌చారిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు రామారావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.
ఆశావర్కర్ల అరెస్టు హేయమైన చర్య..
ఆశా వర్కర్లపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యేలు సబితారెడ్డి, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అసెంబ్లీ వద్ద పోలీసులు ఆశావర్కర్ల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌వేదికగా ఆశావర్కర్లపై పోలీసుల తీరును ఖండించారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించారని మండిపడ్డారు.
బీజేపీ అండగా ఉంటుంది..
హామీని నెరవేర్చాలని ఆందోళనకు దిగిన ఆశావర్కర్లపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం ఆశావర్కర్ల డిమాండ్లు నెరవేర్చేంత వరకు వారికి బీజేపీ అండగా నిలుస్తుందన్నారు.