అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పుతారా?
తక్షణమే వారికిచ్చిన హామీలను అమలు చేయండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సంజయ్ కు వినతి పత్రం అందించిన ఆశావర్కర్లు
కరింనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ఆశావర్కర్ల సమస్యలపై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు ఆశావర్కర్లు బండి సంజయ్ ను కలిసి తమ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు కనీస వేతనాన్ని రూ. 18 వేలు చేయాలని, పెండింగ్ పీఆర్సీ ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని 15 రోజులు సమ్మె చేస్తే... దిగొచ్చిన ప్రభుత్వం పలు హామీలిచ్చిందన్నారు. చివరకు సమ్మె కాలపు వేతనం చెల్లింపు మినహా ఇతర హామీలేవీ నేటికీ అమలు కాలేదని వాపోయారు.
ఈ అంశంపై ఎన్నిసార్లు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. దీంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.