హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన జాతీయ సైక్లిస్ట్ ఆశా మాలియా.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గత నెల 24న కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన ఆశా.. ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాను అభినందించారు. ‘మన వీర సైనికుల త్యాగాల జ్ఞాపకార్థం కార్గిల్ దివస్ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్న ధైర్యవంతమైన అథ్లెట్ ఆశా మాలియాను కలుసుకోవడం ఆనందంగా ఉంది’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాల్వియా గతంలోనూ మహిళల భద్రత, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది.