అందంగా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే చర్మ సౌందర్యం కోసం మార్కెట్‌లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గర యోగా ఆసానాలు వేసి అందంగా మెరిసిపోవచ్చు. అందుకోసం ఏయే ఆసనాలు వేయాలో తెలుసా..
శీర్షాసనం: శీర్షాసనంలో తలకిందుగా ఉండాలి. ఒక చాప తీసుకుని, దానిపై తలకిందులుగా ఉండా లి. తల వెనుకవైపు చేతులు జోడించి ఉంచి.. కాళ్లను నిటారుగా పైకి పెట్టాలి. ఈ పొజిషన్‌లో కాసేపు ఉండి.. ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి.
హలాసనం: ఈ ఆసనం వేసే ముందు వెల్లకిలా పడుకోవాలి. అర చేతులను నేలకు స్పృశిస్తూ ఉంచాలి. ఆ తరువాత పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. అలా పాదలను తల వెనుకవైపునకు తీసుకువచ్చి.. ఛాతి గడ్డానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఈ భంగిమలో కాసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి.
సర్వంగాసనం: ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత మీ పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. పాదాలు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. తుంటి భాగాన్ని సైతం పైకి లేపాలి. మీ అరచేతులతో సాయంతో నడుమును పైకి లేపినట్లుగా పట్టుకోవాలి. మీ భుజాలు, కాళ్లు సమానంగా ఉంచేలా ప్రయత్నించాలి. మీ దృష్టిని పాదాలపై కేంద్రీకరించాలి. అలా ఉఛ్వాస, నిశ్వాసలను సాగిస్తూ కాసేపు ఉండాలి.
ఈ ఆసనాలు వేయడం వల్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చర్మం రంగు కూడా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ చర్మానికి బాగా అందుతుంది. దీనితో చర్మానికి మెరుపు వస్తుంది. ప్రతిరోజు మూడు నుంచి ఐదుసార్లు ఈ ఆసనాలను వేయడం వల్ల చర్మ ముడతలు, సాగదీత లాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు యోగా ట్రైనర్స్.