30-03-2025 12:56:29 AM
వక్ఫ్ బోర్డు అసలు మతపరమైన సంస్థే కాదు
ఆ బోర్డులోకి ముస్లిమేతరులను చేర్చడంతోనే పారదర్శకత
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు సవరణలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. తప్పుదారి పట్టించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఒవైసీ మైనార్టీ సమాజాన్ని మోసం చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మోదీ ప్రభుత్వం ముస్లిం సమా జాన్ని లక్ష్యంగా చేసుకుంటోందన్నట్టుగా ఒవైసీ తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డును మతపరమైన సంస్థగా ఒవైసీ పేర్కొనడాన్ని సుభాష్ తప్పుబట్టారు. వక్ఫ్ బోర్డు మతపరమైన సంస్థే కాదని.. ఆస్తులకు చట్టబద్ధ రక్షణ కల్పించే వ్యవస్థగా పేర్కొన్నారు. ఓవైసీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు.
విభజన సమయంలో పాకిస్థాన్‌కు వలస వెళ్లిన వారి ఆస్తులను సంరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదట వక్ఫ్ బోర్డును స్థాపించిందన్నారు. న్యాయవ్యవస్థను కూడా బలహీనపరిచే చట్టం ద్వారా బోర్డు అధికారాలను బలోపేతం చేసిందే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అని ఆరోపించారు. మతపరమైన రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తూనే లౌకి కవాదం గురించి ఇతరులకు ఉపన్యాసా లివ్వడం ఎంఐఎం పార్టీకే చెల్లుతుందన్నారు.
ఏఐఎంఐఎంలో ఇత్తెహాదుల్ -ముస్లిమీన్ పేరిట ఉన్న మతపరమైన గుర్తింపును ఎందుకు తొలగించకూడదని ఎన్నికల కమిషన్ గతంలో ఆ పార్టీని ప్రశ్నించిందని.. అలాంటి మత ఆధారిత పార్టీకి నాయకత్వం వహిస్తూనే ఒవైసీ లౌకికవాదం గురించి వారు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అందరికీ న్యాయం అనేది బీజేపీ విధానమని.. ప్రధాని మోదీ ప్రభుత్వం ముస్లిం సమాజంలోని అత్యంత పేదలకు సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు పాలకమండలిలో ముస్లిమేతరులను అనుమతించడం వల్ల పారదర్శకత పెరు గుతుందని, స్వార్థ ప్రయోజనాల దోపిడీని అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. వక్ఫ్ ఆస్తులను ధ్రువీకరించడంలో జిల్లా కలెక్టర్ పాత్రను ఒవైసీ వ్యతిరేకించడం అక్రమాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. వాస్తవానికి వక్ఫ్ ఆస్తులలో ఎక్కువ భాగం చెల్లుబాటయ్యే భూమి రికార్డులే లేవని.. ఒవైసీకి కూడా ఈ విషయం తెలుసని వ్యాఖ్యానించారు.