తనదైన అందం, అభినయంతో దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ మలయాళ ముద్దుగుమ్మ. పేరు మాళవికా మీనన్. మాతృభాషలో ఈ అమ్మడు నటించిన ‘తంగమణి’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి’ ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాళవికా మీనన్ ఇప్పటి వరకు తన కెరీర్ ఎలా సాగిందో వివరిస్తూనే.. భవిష్యత్తులో ఎంచుకునే పాత్రల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. “నేను తొలిసారి ‘నిద్ర’ అనే మలయాళ చిత్రంలో నటించాను. అందులో నాది హీరోకు చెల్లిలి పాత్ర.. అప్పుడు నా వయసు పద్నాలుగేళ్లు.
ఆ తర్వాత ఏడాది కాలానికి మలయాళంలోనే వచ్చిన ‘916’తో కథానాయికగా పరిచయమయ్యాను. మలయాళ చిత్రాల్లో గ్లామర్ పాత్రలకు అవకాశాలు ఉండవు. తెలుగు, తమిళ భాషల్లో గ్లామరస్ హీరోయిన్‌గా నటించటానికి స్కోప్ ఉంటుంది. అయితే, నేను ఇప్పటి వరకు మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ముద్దు సన్నివేశాల్లో చేయలేదు. కథ డిమాండ్‌ను బట్టి గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధం.. ముద్దు సన్నివేశాల్లో నటిస్తా.. ఇలాంటి సీన్లలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు’ అని వివరించిందీ మలయాళ మందారం. తెలుగులో మాళవికా మీనన్ నటించిన ‘లవ్ కే రన్’, ‘అమ్మాయిలు అంతే అదో టైపు’ వంటి చిత్రాలు వివిధ కారణాల వల్ల విడుదల కాలేదు.