calender_icon.png 19 January, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలవాట్లే ఆలంబనగా!

13-01-2025 12:00:00 AM

రిటైర్మెంట్‌ను కొంతమంది శాపంగా భావిస్తారు. కానీ సరైన ప్లానింగ్ చేసుకోవాలేకానీ.. మలివయసులోనూ ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవించవచ్చు. సరికొత్త అభిరుచులతో కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు. మంచి అభిరుచులు, అలవాట్లతో చక్కని నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఒంటరి అనే భావన కలిగితే వెంటనే ఈ అలవాట్లను అడాప్ట్ చేసుకోవడం మరువకండి. 

జీవితం మారాలంటే మంచి అలవాట్లను కలిగి ఉండాలి.  ప్రతిరోజూ ఏదో ఒకలా గట్టెక్కించేస్తే జీవితంలో ఏ మార్పు రాదు. అందుకోసం రోజూవారీ దినచర్యను కచ్చితంగా పాటించాలి. పెయింటింగ్ వేయడం, నచ్చిన మ్యూజిక్ వినడం కావొచ్చు. కానీ అవన్నీ నిత్యనూతనంగా ఉండేలా చేస్తాయి.

ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టం చూపుతారో అలాంటివాళ్లు చురుకైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని పలు సర్వేల్లో తేలింది. అయితే కొత్త అభిరుచుని కొనసాగించడానికి ప్రత్యేకంగా సమయమే కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారి దినచర్యలో భాగం చేసుకుంటే చాలు. 

ప్రకృతితో కనెక్ట్ 

తోటపని అనేది రిలాక్సింగ్ హాబీ. అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే ఆచరణాత్మకమైనది. చాలా మంది వృద్ధులు తోటపనిని ఒక అభిరుచిగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రకృతికి కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మార్గం. ఒత్తిడిని తగ్గించడానికి మితమైన వ్యాయామంలా పనిచేస్తుంది.

ప్రతిరోజు గంటకుపైగా తోట పనిచేస్తే సుమారు 330 కేలరీలు ఖర్చవుతాయని అంచనా. ఇది సైకిల్ తొక్కడం, నడవడం, తేలికైన బరువులు ఎత్తడం వల్ల ఖర్చయ్యే కేలరీలతో పోలిస్తే ఎక్కువే. చిన్న చిన్న జాగ్రత్తలతో తోటపనిని హాబీగా కొనసాగించవచ్చు. 

రంగులలో కలవో.. 

పెయింటింగ్ మనసుకు నచ్చిన హాబీ. కాగితంపై అనేక రంగులతో పెయింటింగ్ వేయడం మనసు ఉత్తేజంగా ఉంటుంది. అనేక రంగులను కలపడం, వాటితో ఓ మంచి రూపాన్ని తీసుకురావడం అనేది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. అయితే ఈ హాబీని నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రంగుల పట్ల ఇష్టం ఉంటే చాలు. ప్రతిరోజును పెయింటింగ్‌ను అలవాటు చేసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.

అదిరే ఆర్ట్

చేతి నైపుణ్యంతో తయారుచేసిన వస్తువులను హస్తకళ అంటారు. ఈ హస్తకళల్లో ప్రధానంగా అల్లికలు, ఎన్నో కళాకృతులు ఉన్నాయి. వాటిలో మీకు ఇష్టమైన కళను అభిరుచిగా ఎంచుకుంటే.. జీవితంలో బోర్ అనే పదమే వినిపించదు. ఏదైనా అల్లికల్లో నైపుణ్యం సాధిస్తే.. ఆ తృప్తి వేరుగా ఉంటుంది. ఎవరికైనా పుట్టిన రోజు వేడుకలకు ఏదైనా బహుమతి ఇవ్వాలంటే మీరు తయారుచేసిన వాటిని ఇవ్వొచ్చు కూడా. కళలు నైపుణ్యపరంగానే కాదు.. మానసికంగా చురుగ్గా ఉంచుతాయి కూడా.

గరిటే తిప్పేద్దాం..

బాల్యం, యవ్వనం, మధ్యవయసు ఇలా అనేక దశల్లో మీరు ఎంతో బిజీగా ఉండొచ్చు. ఇష్టమైన అభిరుచులను కొనసాగించలేకపోవచ్చు. ఇష్టమైన ఆహారమూ తినలేకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత కుకింగ్ అంటే ఇష్టం ఉంటే వెంటనే కిచెన్‌లో అడుగుపెట్టండి. ఆ రోజుల్లో మీకు నచ్చిన రెసిపీలను ట్రై చేయండి. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ వండి హాయిగా లాగించేయండి. ఇష్టమైన భోజనం వండి తినడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మంచి మూడ్‌లోకి తీసుకెళ్తుంది.  

పుస్తక లోకంలో.. 

పుస్తక పఠనం అనేది.. ఎంతోమందికి ఇష్టమైన అభిరుచి. రోజూ ఏదో ఒకటి చదివితేనేగానీ నిద్రపట్టనివాళ్లు ఎందరో ఉన్నారు. కాబట్టి రీడింగ్‌ను రోజువారి జీవితంలో భాగం చేసుకోండి. అయితే మొదట్లో ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవి చదవడానికి అలవాటు పడకూడదు. దీనివల్ల త్వరగా విసుగు అనిపించవచ్చు. ఒకసారి కాల్పనిక పుస్తకం చదివితే.. మరోసారి ఆత్మకథ చదవొచ్చు.

ఇలా చేయడం వల్ల వివిధ రకాల రచనా శైలులను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. ఏదో సమయం చిక్కినప్పుడు పుస్తకాలు చదవడం.. ఆ తర్వాత పక్కన పెట్టేయడమే కాదు. ఈ అలవాటును కొనసాగించడం వల్ల ఇతర నైపుణ్యాలూ అలవడతాయి. ఎక్కువగా చదవడం వల్ల పద సంపద పెరుగుతుంది. అర్థవంతంగా మాట్లాడగలుగుతారు.. అంతేకాదు ఆలోచింపజేసేలా రాయగలుగుతారు కూడా. 

బర్డ్ వాచింగ్

ప్రకృతిని ఆస్వాదించేవారికి పక్షులను చూడటం ఒక ప్రశాంతమైన అభిరుచి. మీకు బర్డ్ వాచింగ్ అంటే ఇష్టం ఉంటే బైనాక్యులర్ సాయంతో ఇష్టమైన పక్షులను వీక్షిం చవచ్చు. ఈ హాబీ మనసును ఎంతో తేలిక పరుస్తుంది.