calender_icon.png 15 November, 2024 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీలో మొదలైన ఎదురీత

23-07-2024 12:05:00 AM

హరిప్రసాద్ గార్లదిన్నె :

ఉత్తరప్రదేశ్‌లో అంతర్గత పోరు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. కార్యకర్తలకు ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కడం లేదని ఉప ముఖ్యమంత్రి విమర్శిస్తే, ప్రభుత్వం తీరులో మార్పు ఉండదని యోగి స్పష్టం చేశారు. దీంతో, ఈ పంచాయితీ కాస్తా హస్తిన పెద్దలవద్దకు చేరింది. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. విపక్ష ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నట్లుగా ‘యోగిని మార్చితే పరిస్థితేంటి?’ అన్న చర్చకూడా మొదలైంది.

యూపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు 2024లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ప్రధాన కారణంగా నిలిచాయి. అప్పటి వరకూ బీజేపీకి అఖండ విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ, కమలం పార్టీకి ప్రధాన రాష్ట్రమైన యూపీలోనే మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. ఇండియా కూటమి గణనీయంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమికి 36 స్థానాలు రాగా, ఇండియా కూటమికి 43 స్థానాలు వచ్చాయి. కమలదళానికి గతంలోకంటే 32 స్థానాలు తగ్గాయి. దీంతో రెండు పర్యాయాలు దేశంలో సొంతబలంతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు మిత్రపక్షాల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉత్తరప్రదేశ్‌లో భారీగా సీట్లు తగ్గడానికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ‘ప్రభుత్వ తీరే ప్రధాన కారణమని’ చెప్పారు. ప్రభుత్వంలో కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కనందుకే పేలవమైన ఫలితాలు వస్తున్నా యన్నది ఆయన ఆరోపణ. ప్రస్తుతం ఈ పంచాయితీ మోదీ- అమిత్ షా దగ్గర ఉండటంతో త్వరలో యూపీలో 10 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికలపైనే ఈ అంతర్గత పోరుకు పరిష్కారం వెదికే అవకాశం ఉంది. ఆ సమయంలో బీజేపీ పనితీరును బేరీజు వేసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాస్త ఎదురీత తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 సీట్లలో ఆ పార్టీకి రెండు సీట్లలోనే బలం ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

పరీక్షగా మారనున్న ఉప ఎన్నికలు

యూపీలో జరిగే ఉప ఎన్నికల్లో గనుక బీజేపీ పేలవమైన ప్రదర్శన కనబరిస్తే అది భవిష్యత్‌లో వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపగలదు. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఉప ఎన్నికల్లో ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ శాతంలో కాకపోయినా కనీసం మూడు శాతం ఓటర్లపై ఈ ప్రభావం ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కనుక కమలం పార్టీ పేలవమైన ప్రదర్శన చూపితే యోగి నాయకత్వానికి అది ఆటంకంగా మారుతుంది.

ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో గెలుపొందితే దాన్ని బీజేపీ వ్యతిరేక ప్రచారానికి విపక్షాలు ఉపయోగించుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గగానే దాన్ని రాహుల్‌గాంధీ తన ప్రచారానికి ముమ్మరంగా వాడుకుంటున్నారు. బీజేపీని ఓడించడానికి తాము ఫార్ములా కనిపెట్టామనీ చెప్పారు. అయోధ్య రథయాత్రను అక్కడినుంచే అడ్డుకోగలిగా మని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా బీజేపీని ఓడిస్తామని రాహుల్ ప్రకటించారు. త్వరలో యూపీలో జరిగే ఉప ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఓటమి పాలైతే అది యోగి నాయకత్వానికి పెను ప్రమాదంగా పరిణమించగలదనడంలో సందేహం లేదు.

యోగి ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా ‘హిందూ ఐకాన్’ అన్న పేరుంది. ప్రస్తుతమూ ఆయన చరిష్మాకు ఢోకా లేదు. బీజేపీలో మోదీ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి యోగినే అనే ప్రచారమూ ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అక్కడ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం అంత సులభమైన విషయం కాదు. అటువంటిది యోగి తన మార్క్ పాలనతో రాష్ట్రంలో బీజేపీని గెలిపించగలిగారు.

బుల్డోజర్‌తో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న విమర్శలను తట్టుకుని పాలన సాగించారు. గూండారాజ్‌ను అంతం చేయడానికి వేలసంఖ్యలో ఎన్‌కౌంటర్‌లు జరిపారు. గూండాల రాజ్యం లేకుండా చేయడంలో ఒకింత సఫలం అయ్యారన్నది అనేకులు అంగీకరించే విషయం. ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతున్న క్రమంలో పాలనపై వ్యతిరేకత అనివార్యం. కానీ, అది పార్టీ ఓటమి చెందేంత స్థాయిలో లేదన్నది విశ్లేషకులు చెప్పేమాట.

అతి విశ్వాసంతో భారీ నష్టం

నిజానికి గత ఎన్నికల్లో యూపీలో పార్టీకి సీట్లు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నాయకుల మితిమీరిన విశ్వాసమే పార్టీ కొంప ముంచింది. ‘తాము ఎలాగో గెలుస్తాం, కావాల్సింది కేవలం మెజార్టీ మాత్రమే’ అన్న చందంగా నాయకులు వ్యవహరించారు. చాలామంది మొక్కుబడి ప్రచారానికే పరిమిత మయ్యారు. మోదీ పేరుతో ఎలాగైనా గెలిచేస్తామనే అతివిశ్వాసం చూపారు. ఇదే సమయంలో విపక్ష ఇండియా కూటమి నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో విజయం సాధించారు. తత్ఫలి తంగా కమలం పార్టీ సీట్లకు భారీ గండి పడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి ‘డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందనే’ వాదన బలంగా వినిపిస్తున్నది. ఈ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ తన భుజాలపైకి ఎత్తుకుంది. మోదీని ఎవరూ ఓడించలేరనే స్థాయినుంచి మోదీని సైతం ఓడించగలమని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. రాహుల్‌గాంధీకి మోదీని ఓడించే సత్తా ఉందని చాటి చెబుతున్నది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇండియా కూటమి అభ్యర్థులు ఎక్కువగా గెలవడంతో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. ఈ ప్రభావం భవిష్యత్‌లో వచ్చే ఎన్నికలపై పడే అవకాశమూ ఉంటుంది.

నవంబర్‌లో హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీకి ఎదురు గాలి వీస్తున్నది. మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు అక్కర్లేకున్నా ఇతర పార్టీలను చీల్చడంతో ప్రజల్లో వ్యతిరేకత మూట గట్టుకున్నది. ముఖ్యంగా అజిత్ పవార్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడాన్ని కమలం పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లూ అవినీతి పరుడని విమర్శించిన నేతను కూటమి ప్రభుత్వంలో చేర్చుకోవడంతో చాలామంది బీజేపీని నమ్మడం లేదు.

దీనికి తోడు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేక తకు అద్దం పడుతున్నది. అక్కడ ఇండియా కూటమికే ఎక్కువ అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానాలో సైతం ఇదే పంథా కొనసాగుతున్నది. లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే, అక్కడ బీజేపీ ఏకంగా సగం సీట్లను కోల్పోయింది. 2019లో కమలం పార్టీకి 10 సీట్లు వస్తే ఈసారి కేవలం 5 సీట్లకే పరిమితమైంది. ఇండియా కూటమి ఇక్కడ ఐదు సీట్లను పెంచుకుంది. దీంతో ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉండనుంది. దీనికితోడు ప్రస్తుతం బీజేపీ పని అయిపోయిందనే విపక్ష కూటమి ప్రచారానికి ఉప ఎన్నికలు దోహద పడుతున్నాయి.

విపక్షాలు సాగిస్తున్న ఈ ప్రచారానికి బీజేపీ చెక్ పెట్టకపోతే భవిష్యత్‌లో భారీ నష్టాన్ని మూట గట్టుకునే అవకాశం ఉంది. ఈ స్థితిని నిలువరించేందుకు ఏదైనా అద్భుతం చేయాల్సి ఉంది. దీనికి కమలం పార్టీ ముందున్న ప్రధాన వనరు యూపీ ఉపఎన్నికలు మాత్రమే. ఈ ఎన్నికల్లో శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధిస్తే తప్ప విపక్ష కూటమి సాగించే ప్రచారాన్ని అడ్డుకోవడం అసాధ్యం. అందుకే, ఈ ఎన్నికలు గెలవడం బీజేపీకి అనివార్యంగా మారుతున్నది. ఈ క్రమంలో అంతర్గత పోరును త్వరితగతిన చక్కబెడితే పార్టీకే మేలు. లేకపోతే, భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

వ్యాసకర్త సెల్: 7673996504