24-03-2025 12:02:01 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
వనపర్తి టౌన్, మార్చి 23 ( విజయక్రాంతి) : కొందరు కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని అంటున్నారని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీకి అంతం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ శతజయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.
అధికారం కోసం రోజుకోపార్టీ మారే వారు ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారని అలాంటి వారికీ కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారం లేకపోయినా సిపిఐ వందేళ్లుగా సజీవంగా ఉందన్న విషయం వారు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ తదితర పార్టీలు కమ్యూనిస్టు పార్టీని వాడుకొని మోసం చేశారని విమర్శించారు.
మోసపోవటం కమ్యూనిస్టు పార్టీల వంతైందన్నారు. పెద్ద దొంగ కంటే చిన్న దొంగ మేలు అన్నట్టు బిజెపి, బీఆర్‌ఎస్ లు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు.
ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్ పై విమర్శల దాడి చేయటం సిగ్గుచేటు అన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, అబ్రహం, మోష, రాబర్ట్, గోపాలకృష్ణ, శ్రీహరి,ఎత్తం మహేష్, రవీందర్, కృష్ణవేణి, గీత, కుతుబ్, నరసింహ శెట్టి, లక్ష్మీనారాయణ, డంగు కుర్మయ్య, యూసఫ్, కాకం బాలస్వామి, నరేష్, వంశి, భూమిక, శిరీష, సహదేవుడు, కురుమయ్య పాల్గొన్నారు.