calender_icon.png 17 October, 2024 | 5:30 AM

భూముల ధరల పెంపు లేనట్టే

17-10-2024 03:22:48 AM

మార్కెట్ విలువల సవరణపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం 

రిజిస్ట్రేషన్లు మరింత తగ్గుతాయనే భావన

రియల్టీ రంగం గాడిలో పడేవరకు ప్రతిపాదనలు ఆపాలని నిర్ణయం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 16 (విజయక్రాంతి) :  రాష్ట్రంలో భూముల ధరల సవరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుతుండటంతో భూముల మార్కెట్ విలువల సవరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గాడిలో పడేవరకు భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను, రిజిస్ట్రేషన్ చార్జీల సవరణకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని జిల్లాల డీఐజీలకు, డీఆర్‌లకు, సబ్ రిజిస్ట్రార్‌లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ 2024 జూన్ 14వ తేదీన (మెమో : ఎంవి/539/2014 ప్రకారం) మార్గదర్శకాలను జారీచేశారు.

ఈ మార్గదర్శకాల ప్రకారం జూన్ 18 లోపు అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్‌లు తమ పరిధిలోని మార్కెట్ విలువలను సమర్పించాలి. అనంతరం జూన్ 23న మార్కెట్ విలువలకు సంబంధించి రివిజన్ చేసి 25న సబ్ రిజిస్ట్రార్‌లు పంపించిన నివేదికల మీద సీ అండ్ ఐజీతో రివ్యూ మీటింగ్ నిర్వహించి, జూన్ 29వ తేదీన మార్కెట్ విలువలకు సంబంధించి అప్రూవల్ కమిటీ సమావేశం ఆమోదం తీసుకుని 2024 జూలై 1న మార్కెట్ విలువలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి జూలై 15 వరకు అభ్యంతరాలను స్వీకరించాలి.

జూలై 24వ తేదీన రీవైజ్ కమిటీ సమావేశమై మార్కెట్  విలువలకు అంతిమ ఆమోదం పొంది, జూలై 31వ తేదీన కొత్త మార్కెట్  విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. 2024 ఆగష్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావాలి.

భారీగా తగ్గిన ఆదాయం

రియల్ ఎస్టేట్ రారాజుగా ఉన్న హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా రియల్ వ్యాపారం దివాలా తీసింది. రిజిస్ట్రేషన్ల ద్వా రా 2023 జూలైలో రూ.1100 కోట్ల ఆదా యం వస్తే 2024 ఆగస్టులో 780 కోట్ల ఆదా యం మాత్రమే వచ్చింది. అంటే రూ.320 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే 2023 సెప్టెంబర్‌తో పోల్చితే 2024 సెప్టెంబర్‌లో 30శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయి.

2023లో  99,528 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా తద్వారా రూ.955.12 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అయితే 2024 సెప్టెంబర్ లో 80,115 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగగా, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే గతేడాదితో పోల్చితే రూ.304.32 కోట్ల ఆదాయం కేవలం ఒక్క నెలలోనే తగ్గింది.

అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. 2023 సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో 21,407 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం 2024 సెప్టెంబర్‌లో 16,407 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. మేడ్చల్ జిల్లా లోను ఇదే పరిస్థితి.

ఈ క్రమంలోనే ప్రభుత్వం భూముల ధరలను బహిరంగ మార్కెట్ విలువల ప్రకారం పెంచాలనే ప్రతిపాదనలపై వెనక్కి తగ్గిందని, ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తే రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ధరల పెంపునకు ధైర్యం చేయలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రస్తుతం భారీ వ్యత్యాసం

ప్రస్తుతం రాష్ట్రంలో మహిరంగ మార్కెట్ విలువలతో పోల్చితే ప్రభుత్వ మార్కెట్ విలువలకు ఏమాత్రం పొంతన లేదు. భారీగా హెచ్చు తగ్గులు ఉండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పండుతుంది. ఈ క్రమంలోనే ప్రాంతాలను బట్టి భూముల మార్కెట్ విలువలను పెంచాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యంగా నేషనల్ హైవేలు, పారిశ్రామిక వాడలు, కమర్షియల్ జోన్‌లు, గ్రామీణ ప్రాంతాలు, రాష్ర్ట రహదారులు ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలకు ఆయా ప్రాంతా ల ఆధారంగా మార్కెట్ విలువలలను సవరించాలని నిర్ణయించారు. అలాగే హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలో జోనల్ డెవలప్‌మెంట్, సం బంధిత అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ప్రణాళికలను పరిగణలోకి తీసుకొని భూ ముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించారు.

అలాగే వాస్తవ ధరలకు, రిజిస్ట్రేష న్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం వ్యవసాయ భూముల విలువలను కూడా సవరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

రెట్టింపు ఆదాయం ఆశించి..

గత ప్రభుత్వం 2021, 2022లో మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.5 వేల కోట్లకుపైగా రాబడి వచ్చింది. ప్రస్తుతం కూడా భూముల ధరలను సవరిస్తే ప్రభుత్వానికి తక్కువలో తక్కువ రూ.8వేల కోట్ల వరకు వస్తాయని భావించారు.

ఈ క్రమంలోనే నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయ, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని పెంపును నిర్ధారించాలని రేవంత్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం రూ.75 వేలు (ప్రభుత్వ మార్కెట్ విలువ)ను సవరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రస్తుతం 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును కూడా సవరిస్తే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దిగజారడం, భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గడంతో ప్రభుత్వం భూముల ధరల సవరణపై వెనక్కి తగ్గింది.