calender_icon.png 16 January, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైటీడీఏ ఉన్నట్టా.. లేనట్టా?

08-07-2024 03:43:12 AM

  • ఎక్కడికక్కడ నిలిచిన యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు 
  • స్తంభించిన కార్యకలాపాలు 
  • అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు

యాదాద్రి భువనగిరి, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. స్వీయ పర్యవేక్షణలో బృహత్తర ప్రణాళికలు రూపొందిం చారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తగోపుర సముదాయాలు, కాకతీయ పిల్లర్లు, కృష్ణరాతి శిలలతో అద్భుతంగా ప్రధానాలయ ఉద్ఘాటన జరిపారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా గర్భాలయంలో స్వామివారి దర్శనాల ప్రారంభం తర్వాత ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా నిలిచిపోయాయి.

ఆ తర్వాత శాసనభ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం రావడంతో ఆలయ అభివృద్ధి పనులను చేపట్టే ప్రాధికార సంస్థ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. ఆలయ పునరుద్ఘాటన తర్వాత జాతీయ స్థాయిలో ఆలయానికి వచ్చిన ప్రాశస్త్యంతో భక్తుల తాకిడి పెరిగింది. అయితే, వారికి అవసరమైన కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తాగునీరు, ఎండవానల నుంచి రక్షణ, వాష్‌రూమ్స్ వంటి అత్యవసర సదుపాయాలను తాత్కాలిక ప్రాతిపదికన ఆలయ అధికారులే దాతల సాయంతో ఏర్పాటు చేసి ఊరట కల్పిస్తున్నారు. దీంతో అసలు ఆలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి ఏర్పాటైన  వైటీడీఏ ఉన్నట్టా.. లేనట్టా? అనే సంశయం వ్యక్తమవుతోంది. 

ఎక్కడి పనులు అక్కడే..

తెలంగాణను తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి(ఎంఏయూఏ) శాఖ పరిధిలో ఏర్పాటైన వైటీడీఏ ద్వా రా దాదాపు రూ.1,200 కోట్లతో ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా ప్రధానాలయాన్ని అద్భుతంగా నిర్మా ణం చేసి 28 మార్చి 2022న పునరుద్ఘాటన చేపట్టారు. అయి తే, ఆ తర్వాత ప్రణాళికలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వైటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీస మౌలిక వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో నిరీక్షించే ప్రదేశంలో ఎండావానల నుంచి రక్షణకు కనీసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది.

రింగ్ రోడ్డుతో పాటు పుష్కరిణి పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేశారు. భక్తులు కొండపై నిరీక్షించడానికి వైటీడీఏ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయకపోవడంతో, గత వేసవిలో ఆలయ అధికారులే దాతల సాయంతో తాత్కాలిక షెడ్లు ఏర్పా టు చేశారు. అదే విధంగా మూత్రశాలల నిర్మాణం లేకపోవడంతో ఆలయ నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరిణి వద్ద రక్షణ ఏర్పాట్లతో పాటు గండి చెరువులో బోట్స్ ఏర్పాటు పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయకుం డా వదిలిపెట్టారు. కొండ చుట్టూ రింగ్ రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు కూడా అర్ధాంతరంగా నిలిపేశారు.

అదే విధంగా తులసి కాటేజీ వద్ద మొదటి ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పనులు సైతం నిలిపివేశారు. రాయిగిరి చెరువు వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న మినీ శిల్పారామంను వినియోగంలోకి తీసుకురావడానికి వైటీడీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వందల కోట్ల వ్యయం చేసినా కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించే వైటీడీఏ పట్టించుకోకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం సమీక్షిస్తేనే.. 

యాదాద్రి ఆలయ పున:నిర్మాణ పనులకు గత ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లు కేటాయించింది. దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ పున:నిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనులకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) లేకుండానే ప్రణాళిక లోపాల కారణంగా నిధుల వ్యయంలో దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసినా, ఇంకా పలు నిర్మాణ సంస్థలకు బిల్లులు బకాయిలు ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

దీంతో అసంపూర్తిగా మిగిలిన పనులకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకు రావడానికి వైటీడీఏ అధికారులు వెనుకా ముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆలయ అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, వ్యయంపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తేనే పనులు ముందుకు సాగుతాయని వైటీడీఏ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.