- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రం క్లారిటీ
- క్రీమీ లేయర్ ఉండబోదన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్
- క్రీమీ లేయర్ ఉండాలని అభిప్రాయపడిన జడ్జీలు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: సుదీర్ఘ కాలంగా రగులుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వటంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆయా వర్గాలు గళమెత్తుతున్నాయి. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని అధికార ఎన్డీయే మిత్రపక్షాలే ప్రకటించాయి. మరోవైపు కోర్టు తీర్పులోని అంశాలపై తీవ్ర చర్చ జరుగుతున్నది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కొందరు న్యాయమూర్తులు ఓబీసీ రిజర్వేషన్లలో ఉన్నట్టుగానే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కూడా విభజన తర్వాత క్రీమీ లేయర్ (సంపన్నవర్గం) ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.
క్రీమీ లేయర్ ఉండదు: అశ్వినీ వైష్ణవ్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విభజన తర్వాత కూడా క్రీమీ లేయర్ అనేది ఏమీ ఉండదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. ‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేష్లపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశంపై క్యాబినెట్ నేడు (శుక్రవారం) సవివరంగా చర్చించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
మార్గదర్శకాలపై మల్లగుల్లాలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించాలంటే ఆయా వర్గాల జనాభా లెక్కలను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీల్లోని ఉప కులాల్లో ఏ కులం ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాబల్యం ఎంత అనేది రాష్ట్రాలు ముందుగా తేల్చాలని సూచించింది. ఆ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించాలని ఆదేశించింది. ధర్మాసనంలోకి కొందరు న్యాయమూర్తులు క్రీమీలేయర్ కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రాష్ట్రాలు పనులు ప్రారంభించాయి. మరికొన్ని రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.