కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతికి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ‘కాంతారా’ చిత్రాన్ని ఏ ముహూర్తాన చేశారో కానీ అక్కడి నుంచి ఆయన్ను భారీ ప్రాజెక్టులు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఒకవైపు ‘కాంతార 2’ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో ‘జై హనుమాన్’ చిత్రంలో హనుమంతుడిగా ఆయననే ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’ చిత్రంలోనూ రిషబ్ శెట్టియే హీరోగా నటిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి తాజాగా రిషబ్ శెట్టి లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రిషబ్ శెట్టి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “ఇంత పెద్ద ప్రాజెక్టులో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్రను సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన.
ఈ యాక్షన్ డ్రామా కోసం.. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసం.. శివాజీ గురించి ఇప్పటి వరకూ తెలియని కథను తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉండండి“ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి వరుసగా మూడేళ్ల పాటు రిషబ్ శెట్టి నటించిన మూడు భారీ ప్రాజెక్టులు విడుదల కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’ వచ్చేసి 2027 జనవరి 21న విడుదల కానుంది.