08-04-2025 12:00:00 AM
వైవిధ్యమైన కథల్లో, నటనా ప్రాధాన్య పాత్రలతో అలరిస్తూ ముందుకు సాగుతోంది అచ్చ తెలుగందం అనన్య నాగళ్ల. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ నుంచి ‘పొట్టేల్’ వరకు అన్నింటా అనన్యకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఇక్కడ నటిగా నిరూపించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏక్తా ఫిల్మ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై హిమ్మత్ లడుమోర్ నిర్మాణం లో ఓ మహిళా ప్రాధాన్యచిత్రం తెరకెక్కుతోంది.
దీనికి రాకేశ్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో అనన్య గిరిజన అమ్మాయి పాత్రలో నటిస్తోందట. ఈ సినిమాకు ‘కాంత’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అనన్య హిందీ మార్కెట్లో అడుగుపెడుతున్న ఈ తరుణంలో తెలుగునాట ఆసక్తికర చర్చ సాగుతోంది. ముంబయి హీరోయిన్లు టాలీవుడ్‌లో పాగా వేస్తున్న ఈరోజుల్లో ఓ తెలుగమ్మాయి బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్ చేయడం మననకు గర్వకారణమని అభిప్రాయపడుతోంది తెలుగు సినీప్రేక్షక లోకం!