calender_icon.png 22 February, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవమానించిన చోటికే స్పీకర్‌గా..

20-02-2025 11:10:07 PM

ఢిల్లీ అసెంబ్లీ శాసనసభాపతిగా విజేందర్ గుప్తా..

రోహిణి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక..

న్యూఢిల్లీ: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న చందంగా.. ఏ అసెంబ్లీలో తనను అవమానించారో అదే అసెంబ్లీ స్పీకర్‌గా అడుగుపెట్టనున్నారు రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా. రోహిణి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విజేందర్ పేరును గురువారం ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం శాసనసభాపతిగా ప్రతిపాదించింది. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల బలం బీజేపీదే కావడంతో ఆయన ఎన్నిక లాంచనమే. గత పదేళ్లలో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ విజేందర్ హ్యాట్రిక్ గెలుపు అందుకున్నారు. ఈసారి ఆప్‌కు చెందిన ప్రదీప్ మిట్టల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విజేందర్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఆయన్ను చాలాసార్లు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లగొట్టారు. 2017లో అసెంబ్లీలో విజేందర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరడజను మార్షల్స్ ఆయన్ను బయటకు ఈడ్చుకెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మళ్లీ అదే ఢిల్లీ అసెంబ్లీలోకి స్పీకర్‌గా అడుగుపెట్టనుండడంతో బీజేపీ వర్గం తెగ సంబరపడిపోతుంది. పార్టీ తనకు స్పీకర్ పదవి కేటాయించడంపై విజేందర్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఆహ్ల్లాదకర వాతావరణంలో చర్చలు జరిగేలా చూస్తానన్నారు. ఇదిలా ఉండగా రామ్‌లీలా మైదానంలో గురువారం వేలాది మంది ప్రజల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు.