07-03-2025 12:00:00 AM
గత ఏడాది ‘మనమే’ చిత్రంతో ఆకట్టుకున్నారు హీరో శర్వానంద్. ఇంకా ఆయన ‘నారి నారి నడుమ మురారి’లోనూ నటిస్తున్నారు. ఆయన కథానాయకత్వంలో మరో చిత్రం వస్తోంది. అది ప్రస్తుతానికి ‘శర్వా36’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. అభిలాష్ కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. మేకర్స్ త్వరలోనే టైటిల్‌ను సైతం లాంచ్ చేయనున్నారు.
ఇందులో శర్వా స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నారు. గురువారం శర్వా పుట్టినరోజు కావటంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సినిమాలోని అతని లుక్‌ను రివిల్ చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. టోర్న్ జీన్స్, స్టుటైలిష్ స్పోర్ట్స్ జాకెట్, షేడ్స్ ధరించి యమహా ఆర్‌ఎక్స్-100 బైక్‌పై కూర్చున్న శర్వా లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా..
బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. మూడు తరాల నేపథ్యంలో ఒక కుటుంబం, ప్రేమ, కలలతో ముడిపడి 90లు, 2000ల ప్రారంభంలో సాగే కథ ఇది. ఈ చిత్రానికి డీవోపీ: జే యువరాజ్; సంగీతం: జిబ్రాన్; ఎడిటర్: అనిల్‌కుమార్ పీ; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం.