అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు, అర్చకులు వేద ఆశీస్సులు అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆయనకు శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ‘‘ఈరోజు తిరుపతి బాలాజీ ఆశీస్సులు తీసుకోవడానికి నా భార్యతో కలిసి వచ్చాను. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. అందరి శ్రేయస్సు, దేశం, ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించాను” అని తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ ఆప్ అధినేతకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మద్యం కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మే 10న లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2 న సరెండర్ కావాలని ఆదేశించింది.