calender_icon.png 12 March, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్ర సంక్షోభం

09-03-2025 12:00:00 AM

(మార్చి 15న వరల్డ్ స్లీపింగ్ డే సందర్భంగా)

స్లీపింగ్ సిక్‌నెస్ ఈమధ్యకాలంలో తరచుగా అందరి నోట్లో వినిపిస్తున్న మాట ఇది. ఈ సమస్య మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిజానికి మన శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఈనెల 15న వరల్డ్ స్లీపింగ్ డే సందర్భంగా నిద్రలేమి సమస్యలు వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం.. 

కోవిడ్ సమయంలో చాలామంది వినోదం కోసం ఫోన్, టీవీలపై అధికంగా ఆధారపడ్డారు. ఈ అలవాటే ప్రస్తుతం అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానికి రెండు గంటల ముందు మెలటొనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల ఆగిపోతుంది.  

సర్వే ఏం చెబుతుందంటే?

‘గ్లోబల్ స్లీప్’ సర్వే ప్రకారం భారతీయుల్లో నిద్ర సంక్షోభం ముంచుకొస్తుందని తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలామంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ.. ఎలాంటి వైద్య సహాయం తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు. 

ప్రతీ నలుగురిలో ఒకరు..

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ఒకరు (22 శాతం) నిద్రలేమికి గురవుతున్నారు. వీరు ఎలాంటి సహాయం కూడా పొందడం లేదు. ఈ నిద్రలేమి అనే అంశం వ్యక్తుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పనికి అంతరాయం కలిగిస్తోంది. మానసిక శ్రేయస్సును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మనదేశంలో 49 శాతం మంది వారానికి కనీసం మూడు రోజులు నిద్రించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. 

నివేదికలోని అంశాలు.. 

37 శాతం మంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత రాత్రి షిప్టులలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది సహజ నిద్రపై ప్రభావాన్నిచూపుతుంది. 

మహిళలు నాణ్యమైన నిద్రను వారంలో కనీసం కొన్ని గంటలు కూడా నిద్రించలేకపోతున్నారు.

స్త్రీల రుతుచక్రంపై నిద్ర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.

మనదేశంలో నిద్రలేమి కారణంగా పురుషుల (12శాతం)తో పోలిస్తే స్త్రీలు(17శాతం) సిక్ లీవ్‌లు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 

80 శాతం మంది ఉద్యోగులు నిద్ర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 47 శాతం మంది తమ యజమానులు నిద్ర ఆరోగ్యాన్ని పట్టించుకోరని భావిస్తున్నారు. 

47 శాతం మంది భారతీయులు నిద్రలేమి కారణంగా వచ్చే అలసట కారణంగా తమ కెరీర్‌లో ఒక్కసారైనా సిక్ లీవ్ తీసుకుంటున్నారని వెల్లడించింది. 

ఇలా చేద్దాం

నిద్ర కోసం సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించాలి. ప్రో బయోటిక్ ఆహారం నుంచి నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇందుకోసం రోజూ పుల్లటి పెరుగు తినవచ్చు.

సాయంత్రం తర్వాత టీ, కాఫీలు తీసుకోకూడదు. టీ, కాఫీ వంటి పానీయాలలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. టీ, కాఫీ తాగితే అంత తేలికగా నిద్రపట్టదు.

సరైన సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే నిద్రపోయే ముందు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించే అలవాటుకు దూరంగా ఉండాలి. పడుకునే కంటే రెండు గంటల ముందు ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగించడం మానేయాలి. అవసరమైతే పుస్తకాలు చదవడం.. డైరీ రాయడం చేయాలి.

మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది. నిద్ర మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటే మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి.   

మంచి నిద్రకు..

పగటి పూట బాగా చురుగ్గా, బిజీగా ఉంటూ అలసిపోండి.. రాత్రి నిద్రవేళ సరికి క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వచ్చేయండి.

పగటిపూట మధ్యమధ్యలో కునుకు తీయడం తగ్గించండి.

నిద్రకు ముందు రాత్రిపూట మీ దినచర్య హాయిగా ఉండేలా చూసుకోండి. బెడ్ రూమ్ విశ్రాంతి, నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి.

దళసరి కర్టెన్లు, సరైన గది ఉష్ణోగ్రత, మంచి పరుపు వంటివి ఏర్పాటు చేసుకోండి.

నిద్రించడానికి ముందు కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. 

నిద్రరాకపోతే చికాకు పడకుండా లేచి కూర్చొని మనసుకు నచ్చే ప్రశాంతమైన పని ఏదైనా చేయండి. పుస్తకం చదవడం వంటివి చేయాలి. 

మంచి రిలేషన్ కోసం.. 

మనకు సాధారణంగా ఎనిమిది గంటల నిద్ర అవసరమని చెబుతుంటారు. అయితే మినిమం 6 నిద్ర తప్పనిసరి. కాకపోతే ఇప్పుడొచ్చిన సోషల్ మీడియాల వల్ల ప్రభావం వల్ల కానీ.. ఇలా రకరకాల కారణాలతో.. నిద్ర సమయం అనేది పూర్తిగా తగ్గింది. స్లీప్ టైమ్ తగ్గడం వల్ల దాని ప్రభావం అనేది ఫిజికల్‌గా, సైకాలజికల్‌గా కూడా ఉంటుంది. మన శరీరం జీవక్రియ పూర్తిగా మారిపోతుంది. దానివల్ల ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా నిద్రలేకపోవడం వల్ల చికాకు వస్తుంది. ఆ టైమ్‌లో ఎవరు కదిలించిన కూడా గొడవపడుతారు. ఎందుకంటే నిద్రసరిగ్గా లేకపోవడం. దీంతోపాటు రకరకాల శారీరక, మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఒక కారు కరెక్టుగా పనిచేయాలంటే.. దానికి రెస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో.. అలాగే ఒక మనిషి ఆనందంగా లైఫ్ లీడ్ చేయాలంటే నిద్ర కూడా అంతే అవసరం. 

 విశేష్, సైకాలజిస్ట్

కృత్రిమ నిద్ర మంచిది కాదు.. 

ప్రస్తుతం వస్తున్న కేసుల్లో మేం ఎక్కువగా జీవక్రియకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నాం. అంటే మన దినచర్యలకు సంబంధించిన జబ్బులే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ దినచర్యలో ముఖ్యంగా కనిపించేది మానసిక ఒత్తిడి, నిద్రలోపించడం. దీన్నే ఇన్పోమియా అంటాం. ఈ రెండింటి కారణంగా మధుమేహం, రక్తపోటు ఇవన్నీ కూడా ఎఫెక్టు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మనకు ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రభావం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. యువతలో ఎక్కువగా గుండెపోటుకు కారణం మానసిక ఒత్తిడి, నిద్రలోపం. నైట్ షిఫ్ట్స్, నైట్ టైమ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా నిద్రమీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆల్కహల్ వల్ల వచ్చే నిద్ర కరెక్టు నిద్ర కాదు. కృత్రిమ నిద్ర కారణంగా.. సహజ శరీరానికి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం లేదు. ఇవన్నీ కూడా నిద్రలోపం వస్తాయి.   

 డాక్టర్ రాజేష్ వుక్కల, జనరల్ ఫిజిషీయన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్