calender_icon.png 26 February, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కృత్రిమ కొరత

26-02-2025 01:19:26 AM

  1. రాష్ట్రంలో వ్యాపారుల కుట్ర ఇది..
  2. యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం 
  3. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నదే బీజేపీ 
  4. మేమెందుకు కేసును అడ్డుకుంటం?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): తెలంగాణలో వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, రాష్ట్రప్రభుత్వం ఆ కుట్రలను అడ్డు కోలేకపోతున్నదని కేంద్ర మంత్రి, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి తాను స్వయంగా కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా తో మాట్లాడానని, తెలంగాణలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేసి నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి 9.5 లక్ష ల మెట్రిక్ టన్నుల ఎరువులు అవస రం కాగా, కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందించిందన్నారు.

ఒకప్పుడు యూపీఏ హయాం లో యూరియా బ్లాక్ మార్కెట్ మార్కెట్‌కు వెళ్లేదని, కేంద్రంలో బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రధాని మోదీ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారని కొనియాడారు. బీజేపీ పాలనలో దేశీయంగానే 90 శాతం యూరియా ఉత్ప త్తి ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని రామగుండంలోనూ ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించామని గుర్తుచేశారు.

పదేళ్లుగా దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, తిరిగి ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం 27.37 శాతం అధికంగా ఎరువులు సరఫరా చేసిందన్నారు.

అదనంగా ఫిబ్రవరి 22న మరో 40 వేల టన్నులు, 23, 24 తేదీల్లో 48 వేల టన్నుల యూరియా పంపించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.22 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనికి తోడు 6 వేల టన్నులు కృష్ణపట్నం పోర్టులో నిల్వ ఉందన్నారు. 

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు మాదే..

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో  గెలుపు బీజేపీదేనని కేంద్ర మంతి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు చట్టసభల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలు వినిపించే వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక, ప్రభుత్వాలను నిలదీసే సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేన న్నారు. కాంగ్రెస్ కేవలం ఒక్క చోట పోటీ చేస్తే తాము మూడు స్థానాల్లోనూ పోటీ చేస్తునామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి 14 నెలలుగా మాట్లాడిన మాటలే ఈ ప్రచారంలోనూ మాట్లాడారని, సీఎం హామీలు, వ్యాఖ్యలను విద్యావంతులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. సీఎం ప్రచారానికి ఒక్క శాతం ఓటర్లు కూడా ఓటు వేయరని జోస్యం చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, తాను అడ్డుకుంటున్నానన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. మూసీ ప్రక్షాళన పనుల్లో మొదటి తట్టా ఎత్తేది తానేనని స్పష్టం చేశారు.

సీఎం స్థాయి వ్యక్తి బీజేపీని, తనను విమర్శిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని, సీఎం ఆరోపణలు, విమర్శ ల్లో ఏమాత్రం నిజాలు లేవన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాను అడ్డం పడుతున్నట్లు సీఎం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, సీఎంకు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని తొలుత డిమాండ్ చేసిందే బీజేపీ అని గుర్తుచేశారు.

ఆ కేసును బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయి నేత ఏమాత్రం పరిపాలనపై అవగాహన లేకుండా మాట్లాడడమేంటని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, భూముల కొనుగోలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయాలని నాడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారని, తీరా అధికారంలోకి వచ్చాక మిన్నకుండి పోతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం పరిధిలో ఎన్ని ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమ చేసిందన్నారు. పథకం ద్వారా తెలంగాణవ్యాప్తంగా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నదన్నారు.