బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్
పటాన్ చెరు, జనవరి 29 : అధునాతన పరిజ్జానాలైన కృత్రిమమేథ (ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)లను భారతీయులు కూడా అందిపుచ్చుకోవాలని, అత్యంత ఖర్చు, వ్యయప్రయాసలతో కూడినదైనా దానిని వదులుకోకూడదని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయ పడ్డారు.
‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు, ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెఎస్)లో బుధవారం ఆమె పలు అంశాలపై మాట్లాడారు. రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్ తన పైలట్ పరిశోధన అధ్యయనం ప్రారంభ ఫలితాలను వివరించారు.
నిజామాబాద్, హైదరాబాద్ నుంచి రెండు కీలక కేస్ స్టడీలను ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ, తెలంగాణలో కృత్రిమ మేథ యొక్క సంక్లిష్ట దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఈ స్థానిక ఉదాహరణలను జాతీయ, అంతర్జాతీయ ఏఐ అభివృద్ధి యొక్క విస్తృత చట్రాలలో పరిశీలించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో తెలంగాణ పథం యొక్క క్లిష్టమైన విశ్లేషణలను డాక్టర్ రఘునాథ్ అందించారు.
జీవనోపాధి, అభివృద్ధి మధ్య సంక్లిష్ట పరస్పర చర్య, సామాజిక-పర్యావరణ పరిగణనలు, దక్షిణ అర్ధగోళం లో (గ్లోబల్ సౌత్) అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క చిక్కులను వివరించారు. ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి మధ్య సమతుల్యత, ఏఐ ప్రపంచ కథనంలో స్థానిక సందర్భాలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతలను ప్రస్తావించారు.
చారిత్రక వ్యాపారం-సాంకేతిక కథనాల ను గుర్తించడం, యూరో-అమెరికన్ దృక్కోణాలను దాటి వెళ్లడం, సాంకేతిక పురోగతిలో ప్రత్యక్ష అనుభవాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతలను తెలిపారు. జీఎస్ హెఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్, డాక్టర్ జి.అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు.