calender_icon.png 4 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ

03-04-2025 07:00:24 PM

గీతం అంతర్జాతీయ గ్రీన్ ఏఐ-2025 సదస్సులో వ‌క్త‌ల పిలుపు..

ప‌టాన్ చెరు (విజయక్రాంతి): సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ (Artificial intelligence)ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారం అవసరమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ(GITAM School of Technology)లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Green Artificial Intelligence), ఇండస్ట్రియల్ అప్లికేషన్స్’(Industrial Applications) (గ్రీన్ ఏఐ-2025) అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైంది.

హైదరాబాదులోని మహీంద్రా విశ్వవిద్యాలయ ఎమెరిటస్(Mahindra University Emeritus) ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పూజారి, ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయ(Fakir Mohan University) ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి వంటి విద్యావేత్తలు ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారు. సదస్సు సావనీర్ ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అరుణ్ ‘ఇంటర్ ప్రెటబుల్ క్లస్టరింగ్’పై లోతైన అవగాహన కల్పించేలా కీలకోపన్యాసం చేశారు. గ్రీన్ ఏఐ అభివృద్ధి చెందుతున్న రంగమని, ఇటువంటి ట్రెడింగ్ రంగంపై గీతం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. స్థిరమైన కృత్రిమ మేధస్సు యొక్క ఔచిత్యాన్ని వివరిస్తూ, ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో అన్వేషించమని పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు.

ఈ సదస్సు ఏఐ, అధిక-పనితీరు గల కంప్యూటింగ్ లో కొత్త పరిశోధనా మార్గాలు, వినూత్న అంశాలతో స్ఫూర్తిస్తుందని ప్రొఫెసర్ అరుణ్ ఆశాభావం వ్యక్తపరిచారు. దక్షిణ కొరియాలోని యోన్సే విశ్వవిద్యాలయ(Yonsei University) ప్రొఫెసర్ సంగ్-బే చో వర్చువల్ గా ‘డీప్ లెర్నింగ్ పై ఇటీవలి వినూత్న రచనలు: సాఫ్ట్ కంప్యూటింగ్ ల్యాబ్ యొక్క దృక్పథాల’పై కీలకోపన్యాసం చేశారు. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ యొక్క అపారమైన సామర్థ్యాన్ని, నైతిక ఏఐ విస్తరణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఏఐని ఉపయోగించుకోడంలో భారతదేశం, కొరియా మధ్య సహకారం ఎందుకు ఉండకూడదని ప్రొఫెసర్ సంగ్-బే ప్రశ్నించారు.

ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి ‘మెషిన్ లెర్నింగ్(Machine learning)లో పరేటో ఫ్రంట్ ను వెలికితీయడం’పై ఉపన్యసిస్తూ, ఏఐ-ఆధారిత పరిష్కారాలలో ఆప్టిమైజేషన్ పద్ధతులపై విలువైన అంతర్దృష్టులను అందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అధ్యక్షత వహించారు. సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా అతిథులను సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా 262 పరిశోధనా పత్రాలు ఈ సదస్సులో సమర్పించారని, వాటిలో 40 పత్రాలు స్ప్రింగర్ ప్రచురణకు ఎంపికైనట్టు సదస్సు నిర్వాహకుడు డాక్టర్ శరత్ చంద్ర నాయక్ వెల్లడించారు.