జమ్మూ, కశ్మీర్‌కు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఒమర్ అబ్దుల్లా సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతోనే మరోసారి ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశం తెరపైకి వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ సమావేశం మొత్తం ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొడవతోనే గడిచిపోయింది. ఈ గొడవ మధ్యలోనే కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి న్యాయపరంగా ఉన్న మార్గాలను అన్వేషించాలని కేంద్రాన్ని కోరుతూ ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ ఆమోదించింది.
తీర్మానానికి కాంగ్రెస్, మాజీ సీఎం మెహబూబా ముఫ్త్తీ నేతృత్వంలోని పీడీపీ సహా లోయలోని అన్ని పార్టీలు మద్దతు తెలపగా, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకదశలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభలోనే కొట్టుకునేంత పని చేశారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షను అసెంబ్లీ ద్వారా దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ తీర్మానాన్ని చేశామని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
అయితే అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అయిదేళ్ల క్రితం రద్దయిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం సాధ్యమేనా? పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తుందా? పార్ల మెంటు, సుప్రీంకోర్టు సైతం రద్దును సమర్థించిన తర్వాత ఎలా పునరుద్ధరిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే రద్దు చేసిన పార్లమెంటే తిరిగి దీన్ని పునరుద్ధరించవచ్చని, అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అంతకన్నా విస్తృత ధర్మాసనం తిరిగి పరిశీలించవచ్చని ఒమర్ అబ్దుల్లా గతంలో అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటుగా రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించేందుకు 2019లో మోదీ ప్రభు త్వం పక్కా ప్రణాళికను అమలు చేసింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో రాష్ట్రపతి రాజ్యాంగంలోని 367 అధికరణం కింద అధికారాలను ఉపయోగించుకుని 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ మేరకు పార్లమెంటులో ప్రకటన చేయడం, దానికి బీజేపీతో పాటుగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు మద్దతు తెలపడం జరిగిపోయాయి.
2023 డిసెంబర్ 11న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం 370 అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో ఆర్టికల్ 370కి శాశ్వతంగా తెరపడినట్లయింది. దీంతో కశ్మీర్‌నుంచి లద్దాఖ్‌ను వేరుచేసి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం, జమ్మూ, కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభన లాంటి పనులన్నీ చకచకా జరిగిపోయాయి.
అయినా లోక్‌సభ ఎన్నికలు, శాంతిభద్రతల సమస్య లాంటి పలు కారణాలతో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఏడాది సెప్టెంబర్‌అక్టోబర్ నెలల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగడం, ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగేలా చూస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా దీనికి పరోక్షంగా మద్దతు తెలిపింది.
అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే అధికార పార్టీ దీనికి సంబంధించిన తీర్మానం ప్రతిపాదించడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఆర్టికల్ 370ను ప్రపంచంలో ఏ శక్తీ పునరుద్ధరించలేదని,అది జరిగిపోయిన అధ్యాయం అని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ముక్తకంఠంతో అంటున్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్‌లాగా విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబడుతున్నారు. మరో వైపు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపేందుకు సన్నాహాలు మొదలయినట్లు తెలుస్తోంది. మరి అసెంబ్లీ చేసిన తీర్మానం త్వరలో కేంద్రానికి చేరాక మోదీ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.