calender_icon.png 23 September, 2024 | 2:54 PM

ఆర్టికల్ 370ని మర్చిపోవాల్సిందే!

23-09-2024 02:21:23 AM

  1. ఏ శక్తీ అధికరణను మళ్లీ తీసుకురాలేదు..
  2. ఫరూక్ అబ్దుల్లాకు అమిత్ షా చురకలు

శ్రీనగర్, సెప్టెంబర్  22: ‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా తమ పార్టీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఆర్టికల్‌ను ఏ శక్తి కూడా పునరుద్ధరించ లేదు. ఆర్టికల్ పునరుద్ధరణకు ఆస్కారమే లేదు’ అని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రెండో విడత ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు కశ్మీర్‌కు బంకర్ల అవసరమే లేదని తేల్చిచెప్పారు. ఎందుకంటే ఇక్కడ కాల్పులు జరిపే సాహసం ఇప్పుడెవరూ చేయలేరని అభిప్రాయపడ్డారు.

కశ్మీర్‌లో కేవలం భారత పతాకమే ఎగరాలని, మరో పతాకం ఎగరడానికి అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్రం పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు తాము పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కుండబద్దలు కొట్టారు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని ఆరోపించారు. కానీ, మోదీ సర్కార్ అలా ఎన్నటికీ చేయదని స్పష్టం చేశారు. భారతీయులపై రాళ్లు రువ్విన వారికి జైలు నుంచి ఎలా విముక్తి కల్పిస్తామని ప్రశ్నించారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు ముగిశాయి.