calender_icon.png 27 December, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ తప్పిన జల నిధులు

09-07-2024 03:05:27 AM

  • ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్,   కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరద తాకిడి
  • నిరాశాజనకంగా వర్షపాతం
  • ఇన్ ఫ్లో లేకపోవడంతో డెడ్ స్టోరేజీ దిశగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు
  • పవర్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి సైతం నిలిపివేత

గద్వాల (వనపర్తి)/ ఆదిలాబాద్/ భద్రా ద్రి కొత్తగూడెం/ నల్లగొండ, జూలై 8 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్‌లు, జలాశయాల్లోకి మెల్లమెల్లగా వరద చేరుతోంది. ఇప్పుడిప్పుడే అవి జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో అన్నదాతలు సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ నెలలోనూ దండిగా వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదు .ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సాత్నాల, మత్తడి వాగు, సర్ణ, గడ్డెన్న వాగు ల్లో నీటి ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు)కాగా, ప్రస్తుత నీటి మట్టం 680 అడుగులు (3.530 టీఎంసీలు)కు చేరుకున్నది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,870 క్యూసెక్కులుగా నమోదైంది.

‘జూరాల’ వరద తాకిడి..

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెకు నీటి నిల్వసామర్థ్యం 7.701 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3.994 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుం చి ప్రాజెక్టులోకి 2,051 క్యూసెక్యులు కాగా, అవుట్ ఫ్లో 132 క్యూసెక్యులు ఉంది.

నిండుతున్న కిన్నెరసాని

ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ జలకళను సంతరించుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్ఠం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 398.30 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 69.41 మీటర్లకు చేరుకున్నది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 11 అడు గులకు చేరుకున్నది.

బోసిబోతున్న ‘శ్రీశైలం’..

తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటిమట్టం 813 అడుగుల (36.6టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టులో మరో మూడు అడుగుల నీటిమట్టం తగ్గితే డెడ్ స్టోరేజ్‌గా పరిగణిస్తారు. ఎగువన జూరాల, సుంకేసుల నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. ఏపీ, తెలంగాణ పవర్ హౌస్‌ల్లో విద్యుదుత్పత్తి కూడా కొనసాగడం లేదు. గతేడాది నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆశించిన మేర ఇన్ ఫ్లో లేకపోవడంతో దిగువ నాగార్జున సాగర్‌కు జలాలు రాలేదు. దీంతో ఆ ప్రభా వం శ్రీశైలం ప్రాజెక్టు ఆయకట్టుపై ప్రభావం పడింది.