calender_icon.png 15 January, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాయాత్రే నా ప్రాణం

18-09-2024 12:00:00 AM

జీవితం ఓ జర్నీ.. కళ్ళ ముందు కదిలిపోయేవి ఎన్నెన్నో దృశ్యాలు. వాటిని కలకాలంబంధించి పెట్టుకొంటే.. ముందుగా చిత్రకారుడిగా.. ఆ తర్వాత యాత్రికుడిగా కళా యాత్ర’ పోచం అదే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలను తిరిగి లైవ్ డ్రాయింగ్స్ వేసిన మొట్టమొదటి వ్యక్తి ఏల్పుల పోచం. తన డ్రాయింగ్ జర్నీ గురించి విజయక్రాంతితో పంచుకున్న ముచ్చట్లు.. 

మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ గ్రామం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నాకొక తమ్ముడు ఉన్నాడు. వాళ్లు నా మీద నమ్మకం చాలా గొప్ప విషయం. వాళ్లకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎనిమిదో తరగతి చదివే సమయంలో డ్రాయింగ్ సర్ సత్యనారాయణ గారు ఉండేవారు. ఆయన ప్రోత్సహం బాగా ఉండేది. ‘నువ్వు బాగా రాస్తున్నావ్’ అని నాచేత బ్యానర్స్ రాయించేవారు. నువ్వు ఒక పేద విద్యార్థివి కదా.. భవిష్యత్‌లో పార్ట్ టైమ్‌గా కూడా దీన్ని చేసుకోవచ్చు అని చదువుతో పాటు ఇది నేర్చుకో.. అని చెప్పారు. 

ప్రాంతం మారడంతో.. 

ఇంటర్మీడియట్‌లో మద్దురి రాజన్న ఆర్ట్ షాప్స్‌లో పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో అన్న ఇలా అన్నారు.. “తమ్ముడు ఇది కాదు.. నువ్వు ఫైన్ ఆర్ట్ చేయాలి. అది చేస్తే లైఫ్ టర్న్ అవుతుంది” అని చెప్పారు. అలా అన్ననే డబ్బులిచ్చి హైదరాబాద్‌కు పంపించారు. అలా గత 20 ఏళ్లుగా ఆయన సపోర్టుతో ఈ స్థాయికి వచ్చాను. బీఎఫ్‌ఏ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రకళ సంగీత్ విశ్వవిద్యాలయంలో చేశాను. ప్రాంతం మారడంతో నేను చాలా విషయాలను నేర్చుకున్నా. 

ఒక ఆలోచనతో.. 

ఒక మూడేళ్లు ఉపాధ్యాయుడిగా పని చేశాను. అలా పని చేస్తున్న సమయంలో ఒక ఆలోచన నన్ను కుదుటగా ఉండనివ్వలేదు. ఒక దగ్గర పని చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ ఓ వయసు వచ్చాక రిటైర్‌మెంట్ అవ్వాల్సిందే కదా అనిపించింది. మనిషికి పుట్టుక, చావు రెండు తప్పక ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఉండే కాలాన్ని చాలా జాగ్రత్త.. నాకు నచ్చిన కళ కోసం కేటాయించాలని అనుకున్నాను. ఆ ఆలోచనలతో పుట్టిందే నా కళా యాత్ర. ప్రతి ఒక్క ఫైన్ ఆర్ట్ విద్యార్థికి అబ్జర్వేషన్, లైవ్ స్టడీ చాలా ముఖ్యం.

ఫైన్ ఆర్ట్ విద్యార్థిగా ఒక్క రాష్ట్రమే కాకుండా.. భారత దేశంలో ప్రతి రాష్ట్రాన్ని సందర్శించి.. అనుభవపూర్వకంగా వాటిని చూసి బొమ్మలుగీశాను. చాలామంది అంటుంటారు.. పరిస్థితులు బాగాలేవ్.. డబ్బులు లేవ్.. మాకు చెప్పేవాళ్లు సరిగ్గా లేరని.. అవన్నీ అపోహలే. ఏదైనా చేయాలి అనుకుంటే ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా ముందుకు సాగిపోవాలి. మన గమ్యం సరైనదే అయితే ప్రకృతి, సమాజం మనకు సహకరిస్తుంది.  

లైవ్ డ్రాయింగ్‌లో..

లైవ్ డ్రాయిండ్స్ వేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. డ్రాయింగ్ వేసేటప్పుడు.. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ దగ్గర ఇబ్బంది ఉండదు. థర్డ్ పర్సన్ వస్తే ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక్కడ వాళ్ల తప్పు ఉండదు. మన తప్పు ఉండదు. ఒక దేవాలయం మీద చెక్కిన బొమ్మలను డ్రాయింగ్ వేస్తుంటే.. మధ్యలో ఎవరో ఒకరు రావడం, పోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక లైవ్ ఆర్టిస్ట్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 

లక్ష్యం పెద్దదైతే.. 

కళా యాత్రలో భాగంగా భారతదేశంలోని అన్నీ రాష్ట్రాలను సందర్శించాను. అక్కడి ప్రదేశాలను లైవ్ డ్రాయింగ్ వేశాను. దీనికి సంబంధించి నా స్నేహితులు, ఆత్మీయులు, తెలిసిన వాళ్లు చేసిన సహాయం ద్వారా నా జీవిత కలను నెరవేర్చుకోగలిగాను.  ఎవరికీ తోచినంత వారు సహాయం అందిస్తున్నారు. అలా నాకు ప్రతి రాష్ట్రంలో ఒక వందమంది దాక సన్నిహితులు ఉన్నారు.  మన లక్ష్యం పెద్దగా ఉండి సాధన చేస్తే.. తప్పకుండా ఏదో ఒకరూపంలో సహకరం అందుతుందని అర్థం అయింది. 

ప్రతి రాష్ట్రం ప్రత్యేకమే.. 

మిజోరాం, నాగలాండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘలాయ, ఒడిస్సా, హంపి, గోవా, గుజరాత్, జమ్ముకాశ్మీర్‌లో ఇలా చాలా రాష్ట్రాల్లో లైవ్ డ్రాయింగ్స్ వేశాను. ఆ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానికులతో మాట్లాడి.. అక్కడి పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటాను. గుజరాత్ రాష్ట్రాంలో భుజు జిల్లాలోని ‘ ది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్’లో మాత్రమే గుజరాతీ సంప్రదాయం బాగా కనిపిస్తుంది. అక్కడి డ్రెస్ స్టుల్.. వాటికి ఉండే రంగులు.. పెద్ద పెద్ద ముక్కు పుడకలు చాలా ఆకట్టుకుంటాయి. అలాగే రాజస్థాన్‌లో పుష్కర మేళా అని ఒక పండుగ జరుగుతుంది. అక్కడ దాదాపు ఒక నెల రోజులు ఉన్నాను. 

మిజోరాం చాలా ప్రత్యేకం.. 

ఈ కళా యాత్ర ప్రారంభించి దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా అయింది. వాస్తవానికి భారతదేశం చాలా గొప్పది. మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది అనుకుంటారు బిహార్ అంటే చాలా డిఫరెంట్.. అక్కడి మనుషులు కొంచెం తేడా, హానికరంగా ఉంటారని అంటారు. కానీ అలా ఏం లేదు. మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఎదుటివాళ్లు మనల్ని గౌరవిస్తారు. నా కళా యాత్ర 2,410 రోజులు సాగింది. దాంట్లో గమనించింది ఒక్కటే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చాలా ప్రత్యేకం. నిజం చెప్పాలంటే నిజాయితీగా ఉన్న మనుషులు మాత్రం మిజోరాంలో ఎక్కువగా కనిపించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో.. 

అరుణాచల్ ప్రదేశ్‌లో టీ స్టాల్ దగ్గర బొమ్మ వేస్తుంటే ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి మాట్లాడింది. తాను ఎవరో నాకు తెలియదు.. కానీ అక్కడిక్కడే పరిచయం అయ్యి.. ఆమె వాళ్లింట్లో ఒక వారం రోజులు ఉంచుకుంది. వాళ్ల తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకున్నారు. ఇక్కడ నన్ను చూసి కాదు.. నేను వేసే కళను చూసి వాళ్లు నన్ను ప్రోత్సహించారు.   

ఎగ్జిబిషన్ కోసం..

నేను తిరిగి వేసిన లైవ్ డ్రాయింగ్ పెయింటింగ్స్‌ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్ తీసుకువస్తున్నాను. ముందుగా ‘స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీ’లో ఎగ్జిబిషన్ చేస్తున్నాను. ఇక్కడ పూర్తయ్యాక.. వేరే రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తాను. ఇంకా కొంచెం వర్క్ మిగిలింది. అది పూర్తి చేయాలి. లైవ్ ఆర్ట్ డ్రాయింగ్‌లో తక్కువ సమయం ఉంటుంది. డిటెయిలింగ్ ఉండదు. కాబట్టి దాని వర్క్ ఇంకా మిగిలింది. అది పూర్తి అవ్వగానే ఎగ్జిబిషన్‌కు ప్లాన్ చేసుకున్నాను. 

జార్ఖండ్‌లో.. 

జార్ఖండ్‌లో పద్మశ్రీ గ్రహీత బులు ఇమామ్ ఇంట్లో వారం రోజులు ఉన్నాను. నేను ఎవరో కూడా అతనికి తెలిదు. సర్‌కు నా ఆర్ట్స్ చూపెడదామని వెళ్లాను. ‘అరే ఇంత మంచి కార్యక్రమం మా హజారీబాగ్‌లో చెస్తున్నావా.. అయితే మా ఇంట్లోనే ఉండు.. ఎన్ని రోజులు ఇక్కడుంటే.. మా ఇంట్లోనే ఉండు’ అని చక్కటి అతిథ్యం ఇచ్చారు. ‘ఈ రోజుల్లో మీలాంటి వ్యక్తులు దొరకడం చాలా తక్కువ బ్రదర్’ అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించారు. 

అబ్దుల్ కలాం ఇంట్లో అతిథ్యం..

రామేశ్వరంలోని అబ్దుల్ కలాం గారి అన్నయ్య కొడుకు షేక్ సలీమ్ సర్‌ను కలిశాను. అసలు విషయం ఏంటంటే.. మా ఇంటి గోడలపై ‘మన జననం ఓ సాధారణమైనదే కావొచ్చు. కానీ.. మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి’. మరొకటి ‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది’. అబ్దుల్ కలాంగారి, నెల్సన్ మండేలా కొటేషన్స్ ఉంటాయి. ఆ ఫోటోలు సర్‌కు చూపించడంతో.. ఇలా అన్నారు.. ‘నేను కాలేజీల్లో, స్కూల్లో, లైబ్రరీల్లో మా బాబాయ్  కొటేషన్స్ చూశాను. మొదటి సారి ఇంటి గోడలపై కొటేషన్స్ రాసుకోవడం చూస్తున్నాను. నిజంగా మా బడా పప్పాకా బ్లెస్సింగ్స్ నీకు తప్పకుండా ఉంటాయి.’ అన్నారు.