calender_icon.png 25 October, 2024 | 1:47 AM

కళ తప్పిన యూనివర్సిటీ

15-07-2024 12:29:30 AM

  1. జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో సమస్యల తిష్ట
  2. గోస పడుతున్న విద్యార్థులు
  3. హాస్టల్ వసతి లేక అవస్థ
  4. అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణం

* రాష్ట్రంలోనే ఏకైక లలిత కళల విశ్వవిద్యాలయం జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లో సమస్యలు చిందులేస్తున్నాయి. అనేకమంది మహామహులైన కళాకారులను తయారు చేసిన ఈ యూనివర్సిటీలో కళలపై ఆసక్తి, అభిమానంతో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా సరిగా లేదు. ఉన్న హాస్టల్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు యూనివర్సిటీ అయినప్పటికీ కనీసం గ్రౌండ్ సదుపాయం కూడా లేదు. ఉన్న కాసింత స్థలంలో వాలీబాల్ కోర్టు ఉన్నా దాంట్లో ఎప్పుడూ వాహనాలను  పార్కింగ్ చేసి పార్కింగ్ స్థలంగా మార్చారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గత వీసీల హయాంలో యూనివర్సిటీ పాలన కుంటుపడింది. ఇన్‌చార్జి వీసీకి బాధలు చెప్పుకుందామంటే ఆయన క్యాంపస్ వైపు కన్నెత్తి చూడడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14(విజయక్రాంతి): నగరంలోని మాసబ్‌ట్యాంక్ వద్ద గల జేఎన్‌ఏఎఫ్‌ఏయూ గతంలో జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధ కళాశాలగా ఉండేది. 2008లో అప్పటి ప్రభుత్వం ఈ కళాశాలను ప్రభుత్వ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివి ధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ యూ నివర్సిటీలో చదువుకుంటున్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కలిపి దాదాపు 2,500మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో కనీసం 10శాతం మందికైనా హాస్టల్ వసతి లేదు. కళాశాలగా ఉన్నప్పటి నుంచే విద్యార్థులకు అబిడ్స్‌లో హాస్టల్ వసతి ఉంది. వి ద్యార్థినులకు మాత్రం ఇప్పటికీ హాస్టల్ వసతి కల్పించకపోవడం గమనార్హం. 

హాస్టల్‌లో చేరేందుకు అనాసక్తి

అబిడ్స్‌లోని హాస్టల్ భవనాన్ని 1984లో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో వసతులు సరిగా లేక విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపడంలేదు. దాదాపు 300మందికి సరిపడేలా నిర్మించిన ఈ హాస్టల్ భవనాన్ని యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులకు నోచుకోక విద్యార్థులకు దూరమ వుతున్నది. ఇలాంటి హాస్టల్‌లో కూడా చేరేందుకు ఇష్టపడిన కొందరు పేద విద్యార్థులకు నాలుగేళ్లుగా అధికారులు అడ్మిషన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ హాస్టల్‌లో ఇప్పుడు దాదాపు 35మంది విద్యార్థులే ఉంటున్నారు. ప్రైవేటు హాస్టళ్లలో ఉంటుండడంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.

యూనివర్సిటీలోనే ఉన్నత విద్యా మండలి

జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు చెందిన భవనంలోనే ఏళ్లుగా ఉన్నత విద్యా మండలి కార్యా లయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కార్యాలయాన్ని మరోచోటకు తరలించి, భవనాన్ని యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులకు హాస్టల్ వసతి కోసం కేటాయించాలని విద్యార్థులు కోరుతూ వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల భద్రత కోసం తమ యూనివర్సిటీలోని ఒక సెమినార్‌హాల్, రెండు తరగతి గదులను జీహెచ్‌ఎంసీ అధికారులు ఉపయోగించుకున్నారు. సెమినార్‌హాల్‌లో వెం టిలేటర్లు, కిటికీలను తొలగించి ఇష్టం వచ్చినట్లు గోడలు కట్టారు. యథాతథంగా యూ నివర్సిటీకి అప్పగించడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

విద్యార్థులే వంట మనుషులు

వసతులు సరిగాలేని యూనివర్సిటీ హాస్టలక్ష ఉంటున్న 35మంది విద్యార్థుల కోసం అధికారులు కనీసం వంటమనుషులను కూడా కేటాయించలేదు. దీంతో విద్యార్థులే వంతులవారిగా వంట మనుషులుగా మారుతున్నారు. హాస్టల్‌కు వంట మనుషులు, మెస్ వర్కర్లుగా నియమించిన వారిని యూనివర్సిటీలో ఇతర పనుల కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. కాగా గతంలో హాస్టల్‌ను ఖాళీ చేయాలని యూనివర్సిటీ అధికారులు ఒత్తిడి చేసి నీటి సరఫరాను ఆపివేశారు. ఆగ్రహించిన విద్యార్థులు ఏకంగా యూనివర్సిటీ ఎదుట బహిరంగ స్నానాలు చేసి నిరసన తెలిపారు. 

కొత్త కోర్సుల కోసం ఎదురు చూపు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో బీటెక్, డిగ్రీ కో ర్సులకు రూ.60వేలు, ఎంటెక్, పీజీ కోర్సులకు రూ.1.20లక్షల వరకు ఫీజలు ఉన్నా యి. వాటిలో సెల్ఫ్ కోర్సులే ఎక్కువ. ఈ కోర్సులకు ఫీజురీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి బకాయిలు వి డుదల కాకపోవడం వల్ల విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా సంప్రదాయ కోర్సులే అందుబాటులో ఉండడం తో విద్యార్థులు ఆ కోర్సులనే చదువుకోవాల్సి వస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, పోటీ ప్రపంచానికి అనుగుణంగా కోర్సులు నేర్పించడం లేదని విమ ర్శలున్నాయి.

ఆర్కిటెక్చర్‌లో డిమాండ్ ఉండే అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ (ప్లానింగ్), ఫెసిలిటీస్ ఫర్ డిజైనింగ్ ప్లానింగ్ (ఎఫ్‌ఎస్‌పీ) కోర్సులను యూనివర్సిటీ అధికారులు తొలగించారు. ఆ కోర్సుల కోసం ఇక్కడి విద్యార్థులు ఎస్పీఏ విజయవాడ, ఎస్పీఏ ఢిల్లీ, ఎస్పీఏ భోపాల్‌లకు వెళ్తున్నారు. అధ్యాపకులు లేకపోవడం వల్లే ఆ కోర్సులను ఎత్తేసినట్లు తెలిసింది. ఫైన్ ఆర్ట్స్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పోటీలో ఆర్యుమెంటల్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)లు అందుబాటులోకి వచ్చాయని వాటితో పో ల్చితే విద్యార్థులకు నేర్పే కోర్సులు కాలం చెల్లినవిగా కనిపిస్తున్నాయి. 

55 మందికి 17 మంది ప్రొఫెసర్లు 

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో మొత్తం 55మం ది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాలి. ప్రస్తుతం కేవలం 17మంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ కొందరు మరికొన్ని రోజుల్లోనే రిటైర్ అయ్యేవారున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య ఏటేటా తగ్గుతుండడంతో యూనివర్సిటీ అవసరాల రీత్యా మరో 75మంది కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. కానీ రెగ్యులర్ అధ్యాపకులతో పోల్చితే వీరి బోధనలో అనుభవం, ప్రమాణాలు లేవనే ఆరోపణలున్నాయి.

పనిచేయని బస్సులు.. ఫీల్డ్ ట్రిప్స్ కరువు

ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఒక సెమిస్టర్‌లో కనీసం నాలుగుసార్లు ఫీల్డ్ ట్రిప్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం జేఎన్‌ఎఎఫ్‌ఏయూకు రెండు బస్సులు ఉ న్నాయి. ప్రస్తుతం ఆ బస్సులు ఉపయోగంలో లేవు. విద్యార్థులు ఫీల్డ్‌ట్రిప్స్ కోసం ప్రైవేటు వాహనాల్లో సొంత ఖర్చుతో వెళ్తూ.. ఆర్థికంగా భారాన్ని మోస్తున్నారు.

బస్సుల సౌకర్యం కల్పించాలి

గతంలో యూనివర్సిటీకి ఉన్న బస్సుల్లో ఫీల్డ్ ట్రిప్స్‌కు వెళ్లే వాళ్లం. బస్సులు నిరుపయోగంగా ఉన్నాయి. ఫీల్డ్ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే విద్యార్థులు ప్రైవేటు రవాణా మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులపై భారం పడుతోంది. పేద విద్యార్థులు ,విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న చిన్న ఆటస్థలాన్ని సరిగా నిర్వహించాలి. విద్యార్థులు ఆటలాడుకోవడానికి అనుకూలంగా మార్చాలి.

-- ఇవాన్ వసీం మహమ్మద్, 

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ 

హాస్టల్ వసతి కల్పించాలి

జేఎన్‌ఎఎఫ్‌ఏయూ విద్యార్థులకు రెండేళ్లుగా హాస్టల్‌లో అడ్మిషన్ ఇవ్వడం లేదు. కారణంగా విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అబిడ్స్‌లోని యూనివర్సిటీ హాస్టల్‌ను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. విద్యార్థినులకు కూడా హాస్టల్ వసతి కల్పించాలి. బస్సులను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలి. కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి. భరత్‌కుమార్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ 

సమస్యలు పరిష్కరించాలి

యూనివర్సిటీలోని సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. రోజురోజుకూ రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య తగ్గిపోతోంది. కొన్ని డిపార్ట్‌మెంట్‌లకు హెచ్‌వోడీలు కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులనే నియమించారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు ఆందోళనలు చేశాం. యూనివర్సిటీ అధికారులు మా ఇళ్లకు నోటీసులు పంపించారు. 

-- ఎస్.లిఖిత్‌కుమార్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ