calender_icon.png 14 November, 2024 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెలను తాకే బాణాలు

21-07-2024 09:09:56 PM

జైలుగోడలపై కూడా అగ్నికణాల వంటి పద్యాలు రాసి నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ప్రశ్నించిన ధీరో దాత్తుడు మహాకవి డా.దాశరథి. ‘నా తెలంగా ణ కోటి రతనాల వీణ’ అన్న కవితాశరథి. ఉద్యమాలతోనే జీవితాన్ని గడిపిన దాశరథి కలం  నుండి జాలువారిన కవిత్వం ఆ వాడి వేడిని ప్రబలంగా ప్రతిఫలించింది. కత్తికి రెండువైపులా పదునున్నట్టుగా మనసులోని భావాలను కుండబద్ధలు కొట్టిన నిష్కామకవి దాశరథి. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన కవితాపయోనిధి. విశిష్ట కవిత్వాన్ని వెలయించిన మహాజ్ఞాని. అగ్నిధారలు కురిపించి రుద్రవీణలు మ్రోయించిన ధీశాలి. దాశరథిని మహోన్నత పోరాటపు కవిగా నిరూపించిన గొప్ప గేయం ‘ఆ చల్లని సముద్రగర్భం’. 1949లో ముద్రితమైన దాశరథి ‘అగ్నిధార’లో ఈ గేయ ఖండిక ఉంది. ఈ గేయం ఆయనకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ఎన్నో ప్రశ్నలను సంధించి నిలేసేన గేయం ‘ఆ చల్లని సముద్రగర్భం’. భూగోళం పుట్టుక కోసం సురగోళాలు కూలి, రాలాయని, ఈ మానవ రూపం సిద్ధించడం కోసం పరిణామాలెన్నో జరిగాయన్న ఘటనాఘటనల క్రమాన్ని ఈ గేయంలో దాశరథి వెల్లడించారు. ఒకరిని బలి ఇస్తూ ఇంకొకరు సుఖపడే వికృత పరిస్థితిని గురించి కవి ఆవేదన చెందా రు. అస్తవ్యస్థంగా ఉన్న సమాజపు తీరుతెన్ను ల్ని ఈ పాటలో ఎంతో లోతుగా విశ్లేషించారు. కడుపు కోతలతో అల్లాడిన సగటు మనుషుల కన్నులలోని విషాదమెంతటిదో తెలిపారు. కరవు కాటకాలు అసలే కనిపించని కాలాలకోసం ఎంతో పరితపించారు. కానరాని భాస్క రులను అన్వేషించారు. పరిణామ వాదాన్ని తనలోని తాత్త్వికతతో దాశరథి మిళితం చేసుకున్న తీరు ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. 

పలు ప్రశ్నలను బాణాల్లా సంధించడం ద్వారా ఆలోచనలను రేకెత్తించే ఉద్వేగ శైలిని ఆయన ప్రతిభావంతంగా కనబరిచారు. ఆరోహణ, అవరోహణలను చాలా చక్కగా పాటిం చారు. ఆలాపనకు ఎంతో ఉపయుక్తంగా ఉండే చరణాలతో రచన సాగిన తీరు ఆయనలోని అంతరాగ్ని జ్వాలలకు  ప్రతిబింబ మైంది. పెను నిద్దురను వదిలించే బలమైన ఆలోచనతో, పటిష్టమైన వస్తువుతో నిమగ్నత, నిబద్ధతతో కవి చేసిన సృజన మహాగేయ యాగ ఫలితమే ఆ చల్లని సముద్రగర్భం. బండరాయిలోనూ చలనం తేగలిగిన శిల్ప నైపుణ్యం, ఆలోచనను రగిలించి ముందుకు కదిలించే అరుదైన గాన ప్రయోగం ఈ గేయం. పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి గేయమై గొంతెత్తిన సమరశీలి దాశరథి. సమస్యల చీకటి ముళ్లు తొలగి వెలుగుబాటలు వికసించాలని ప్రగాఢంగా కోరుకున్న సామాజికుడైన కవి కనుకే ఆయన రచనల్లో జీవన వాస్తవాల ఆవిష్కరణ అత్యంత శక్తివంతంగా జరిగింది. ఆ చల్లని సముద్రగర్భంలో దాగిన బడబానలమే వేనవేల జీవన వాస్తవాలను ఆవిష్కరిస్తుందన్న సత్యాన్ని కవి ఈ గేయంలో  విస్పష్టంగా  చెప్నారు. ప్రజల నాలుకలపై ఈ మహాకవి దాశరథి సదా, సర్వదా బతికే ఉంటారు.

డా. తిరునగరి శ్రీనివాస్

9441464764