calender_icon.png 7 January, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లై హమాలీల అరెస్ట్‌లు

05-01-2025 11:48:25 PM

కామారెడ్డి జిల్లాలో హమాలీల సమ్మెను అడ్డుకున్న పోలీసులు

హమాలీల అరెస్ట్‌తో ఉద్యమాన్ని ఆపలేరు

ఏఐటీయుసీ రాష్ట్ర సీనియర్ నాయకులు, న్యాయవాధి వి.ఎల్. నర్సింహరెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కారించాలని గత ఐదు రోజులుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, బిచ్కుందకు చెందిన సివిల్ సఫ్లై హమాలీలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేయడం తగదని ఏఐటీయుసి రాష్ట్ర సీనియర్ నాయకులు ప్రముఖ సీనియర్ న్యాయవాధి వి.ఎల్. నర్సింహరెడ్డి అన్నారు. హమాలీల ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కామారెడ్డి జిల్లాలో సివిల్ సఫ్లై హమాలీలు గత ఐదు రోజులుగా జిల్లాలో ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచాలని ఏరియర్స్ ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. హమాలీలకు జిల్లాలో సొంత గోదాం నిర్మించాలని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సివిల్ సఫ్లై హమాలీలకు మూడు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గతంలో ఒప్పందం అయిన 29 రూపాయలు జీవో ప్రకారం ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు చనిపోతే పది లక్షలు ఇవ్వాలని, 55 నుంచి 60 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు కనీస పెన్షన్ ఇవ్వాలని డిమాండ్లతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో, సివిల్ సఫ్లై కమిషనర్ చౌహాన్‌తో చర్చలు జరపడం జరిగిందన్నారు. చర్చల్లో ఒప్పుకున్న ప్రభుత్వం అమలు పర్చడం లేదన్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కార్మికులను, ఏఐటీయుసి జిల్లా నాయకులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. శాంతియుతంగా కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న హమాలీ కార్మికులను రెచ్చగొట్టె విధంగా గోదాంలు తెరిచి బీహర్, మహరాష్ట్ర, ఒరిస్సా, రాష్ట్రాల కార్మికులను తెప్పించి లారీలు లోడ్ చేస్తున్నారని తెలుసుకొని గోదాంల వద్దకు వెళ్లిన సివిల్ సఫ్లై హమాలీ నాయకులను, ఎఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్, దశరథ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు.

ఇప్పటికైన అరెస్ట్ చేసిన కార్మికులను, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, రెండు సంవత్సరాలకోసారి ఎగుమతి, దిగుమతి రేట్లపైన చెప్పినటువంటి హమీలను అమలు చేయాలని లేనియేడల సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లాలోని సివిల్ సఫ్లై హమాలీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్, సివిల్ సఫ్లై హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు దశరథ్, సివిల్ సఫ్లై హమాలీ నాయకులు బీరయ్య, కృష్ణ, సంపత్, శ్రీనివాస్, బీమయ్య, గంగరాజు, మహేష్, ప్రవీణ్, ఎల్లేశం, సాయిలు,రాజశేఖర్, ప్రసాద్, బాలమల్లు, పద్మలను సదాశివనగర్ యంఎల్‌ఎస్ పాయింట్ వద్ద అరెస్ట్ చేసి భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని నర్సింహరెడ్డి తెలిపారు.