calender_icon.png 9 November, 2024 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్టు తప్పదా?

09-11-2024 01:03:12 AM

ఈ-రేస్ కేసులో ఉత్కంఠ

  1. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! 
  2. మలేషియా పర్యటన రద్దుతో ఆసక్తికరం 
  3. విచారణలో స్పీడు పెంచిన ఏసీబీ
  4. ఏ క్షణమైనా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ అంశం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు చేతులు మారిన ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

దీపావళి వరకు రాజకీయ లక్ష్మీబాంబులు, నాటు బాంబులు పేలుతాయని చెప్పిన మంత్రి పొంగులేటి.. తాజాగా పొలిటికల్ అణు బాంబులే పేలుతాయని చెప్పడంతో.. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఫార్ములా ఈ-రేస్ కేసుకు భయపడి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ మలేషియాకు వెళ్తున్నారని వార్తలు రావడం.. ఆ తర్వాత ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్న ఉదంతం కూడా ఇటు గులాబీ దళంతోపాటు అధికార, ప్రతిపక్షాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏసీబీ విచారిస్తున్న ఈ కేసులో తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణను ఏసీబీ వేగవంతం చేసింది. హైదరాబాద్‌లో ఈ-కార్ రేస్ నిర్వహణలో నిధులను నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లను మంజూరు చేయడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ స్పెషల్ సీఎస్‌గా పనిచేసిన అరవింద్ కుమార్ ఇచ్చిన సమాధానం ఆధారంగా ఏసీబీ అధికారులు తీగలాగుతున్నారు.

దీంతో బీఆర్‌ఎస్‌లోని కొందరు పెద్దల డొంక కదులుతున్నట్లు తెలుస్తోంది. గత సర్కారులో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ నోటి మాటతోనే, ఎలాంటి ఎంవోయూ లేకుండా రూ.55 కోట్లను ఫార్ములా ఈ-రేస్ సీజన్-10ని నిర్వహించేందుకు విడుదల చేసినట్లు అరవింద్‌కుమార్ స్వయంగా చెప్పడంతో ఈ కేసులో ఇక కేటీఆర్ అరెస్టు తప్పదా? ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అరెస్టు కోసమే గవర్నర్‌ను కలిశారా?

దీపావళి సందర్భంగా మంత్రి పొంగులేటి బాంబులు పేలుతాయని చెప్పడం.. సీఎం గవర్నర్‌ను కలుసుకోవడం, కేటీఆర్ తన మలేషియా పర్యటనను రద్దు చేసుకోవడం.. ఇలా ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో పరిణామాలు వేగం పుంజుకున్నాయి. ఈ-కార్ రేస్ సీజన్-9,10 నిర్వహించేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాలను ఒక రిపోర్టు రూపంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అరవింద్ కుమార్, రేవంత్ సర్కారుకు సమర్పించారు.

ఆ రిపోర్టును పూర్తిస్థాయిలో విచారించిన ఏసీబీ ఇక అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రిస్థాయిలో ఉన్నవారిని అరెస్టు చేసేటప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

అరెస్టు విషయంపై అనుమతి కోసమే రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కలిసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం, విచారణకు సంబంధించిన రిపోర్టును అందజేసి నట్లు సమాచారం. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏక్షణమైనా తన అనుమతిని తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

బాంబులు అంటే అర్థం?

మంత్రి పొంగులేటి పొలిటికల్ అణు బాంబులు పేలుతాయని బహువచనంలో చెప్పడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కమిషనర్ ద్వారా జరిపిస్తున్నది. వీటికి తోడు ఇప్పుడు  ఫార్ములా ఈ-రేస్ కేసు కూడా తోడయ్యింది.

ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఫార్ములా కేసుపై కూడా ఏసీబీ ప్రాథమింగా రిపోర్టును తయారు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో వీటిలో ఎన్ని బాంబులు పేలబోతున్నాయి? ఫార్ములా ఈ అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న నేఫథ్యంలో ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరికొంత మందిని అరెస్టు చేయనున్నారా? లేక మిగతా కేసుల్లో కూడా అరెస్టులు ప్రారంభం కాబోతున్నాయా?.. మంత్రి పొంగులేటి చెప్పినట్లు అటం బాంబులు ఎన్ని పేలుతున్నాయి? ఎంతమందిని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.