భారత్‌లో రూ.2,200 కోట్ల ముడుపులిచ్చారంటూ న్యూయార్క్ కోర్టులో కేసు
- తప్పుడు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు చూపి అమెరికా ఇన్వెస్టర్లను మోసపుచ్చారంటూ మరో కేసు
- ఒక్కరోజులో రూ.2.19 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ గ్రూప్
వాణిజ్య రంగంలో సంచలనం.. బిలియనీర్, వాణిజ్యవేత్త గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఇండియాలో ప్రభుత్వాధికారులకు రూ.2,200 కోట్ల ముడుపులిచ్చి సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందారని.. తప్పుడు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లతో అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేశారంటూ యూఎస్ న్యాయశాఖ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో న్యూయార్క్ కోర్టు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌పై అరెస్ట్ వారెంట్లు జారీచేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద 8 గిగావాట్ల సోలార్ ప్లాంట్‌ను 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో (రూ.45,000 కోట్లు) నెలకొల్పి, వచ్చే 20 ఏండ్లలో 2 బిలియన్ డాలర్లకుపైగా నికర లాభాల్ని సంపాదించాల న్నది అదానీ ప్రతిపాదన.
ఈ ప్రాజెక్టు ఉత్పత్తి చేసే ఖరీదైన సౌర విద్యుత్‌ను కొనిపించేం దుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలతో పాటు మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాధికారులకు ముడుపులు చెల్లించారని ఆరోపిస్తూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదయ్యింది. మరోవైపు అదానీలు ఫెడరల్ సెక్యూరిటీల చట్టాలు ఉల్లంఘించా రంటూ.. యూఎస్ సెక్యూరిటీల చట్ట నిబంధనలను అతిక్రమించారంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) చార్జ్‌షీట్ వేసింది.
గౌతమ్ అదానీ 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆ రాష్ట్రం 7,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనడానికి అంగీకరించిందని, మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున 7,000 మెగావాట్లకు రూ.1,750 కోట్ల ముడుపుల్ని ఆంధ్రప్రదేశ్ అధికారులకు చెల్లించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. ఇదే మార్గంలో 500 మెగావాట్ల విద్యుత్‌ను కొనేందుకు ఒడిశా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
అదానీ, అజూర్ పవర్‌లు నెలకొల్పే ప్రాజెక్టు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) కొనుగోలు చేసి, దానికి విక్రయించేందుకు 2021 జూలై డిసెంబర్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లతో అమ్మకపు ఒప్పందాలను కుదుర్చుకున్నదని కోర్టు డాక్యుమెంట్‌లో వివరించారు.
ఢిల్లీకి చెందిన అజూర్ పవర్ 4 గిగావాట్ల విద్యుత్‌ను ఎస్‌ఈసీఐకి సరఫరా చేసే టెండర్‌ను పొందినప్పటికీ, విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్రాలకు మూడో వంతు ముడుపుల్ని చెల్లించలేకపోవడంతో తన కాంట్రాక్టులో కొంత భాగాన్ని అదానీకి అప్పగించిందని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది.
ఇండియాలో చెల్లించిన ముడుపుల్ని అమెరికా బ్యాంక్‌లు, ఇన్వెస్టర్ల నుంచి దాచిపెట్టి, 12 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు బిలియన్ల కొద్దీ డాలర్లను అదానీ గ్రూప్ సమీకరించిందని యూఎస్ అధికారులు ఆరోపించారు. 2020 2024 మధ్యకాలంలో అదానీ గ్రూప్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, యూఎస్‌లోని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల నుంచి 2 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు తీసుకున్నదని, మరో 1 బిలియన్ డాలర్లకుపైబడి బాండ్లను యూఎస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు విక్రయించిందని అమెరికా అధికారులు వెల్లడించారు.
అమెరికా ఇన్వెస్టర్లు, మార్కెట్లకు సంబంధం ఉంటే విదేశాల్లో అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు చేసేందుకు యూఎస్ చట్టాలు అనుమతిస్తాయి. అమెరికా కోర్టులో నమోదైన ఆరోపణలన్నీ నిరాధారమంటూ అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.
అదానీపై కేసుపడే ముందు యూఎస్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ జారీచేసిన 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూను గ్రూప్ రద్దు చేసుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. గురువారం ఒక్కరోజులోనే అదానీ గ్రూప్ రూ.2.19 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది.