calender_icon.png 14 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానంలో వెళ్లి నిందితుల అరెస్ట్

14-02-2025 12:58:25 AM

  1. హిమాయత్‌నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు 
  2. నిందితుల నుంచి రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ స్వాధీనం 
  3. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తింపు 
  4. వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): హిమాయత్‌నగర్‌లో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లోపే హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. విలువైన వజ్రాలు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ ఇతర విలువైన ఆభరణాలతో పాటు పెద్దమొత్తంలో నగదు చోరీకి గురికావడంతో ఈ కేసు నగరంలో సంచలనంగా మారింది.

కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. సినీ ఫక్కీ తరహా నిందితులను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు వివరాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం వెల్లడించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ వ్యాపారి రోహిత్ కేడియా తన కూతురు వివాహం కోసం 5 రోజుల కింద దుబాయ్‌కి  వెళ్లాడు.

ఈ నెల 11న ఇంట్లోని ఆల్మారాలు, లాకర్స్ పగులగొట్టి అందులోని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీని గుర్తించిన మేనేజర్ అభయ్ కేడియా విషయాన్ని యాజమాని రోహిత్ కేడియా చెప్పాడు. యజమాని సూచనల మేరకు మేనేజర్ అభయ్ కేడియా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదే సమయంలో ఇంట్లో పని చేస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా  దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్టు గుర్తించారు.

వీరిని పట్టుకునేందుకు మూడో బృందాలు విమానాల్లో భూపాల్, నాగ్‌పూర్, పాట్నాలకు వెళ్లాయి. నాగ్‌పూర్ రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడ ప్రతీ కోచ్, బోగీని వెతికి దొంగలను పట్టుకున్నారు. ట్రైన్‌లో నుంచే వీడియో కాల్‌తో దొంగలను, వారి వద్ద ఉన్న సొత్తును పోలీసులు యాజమానికి చూపించారు.

చోరీకి గురైన సొత్తును యాజమాని గుర్తించడంతో నిందితులు మొలహు ముఖియా, సుశీల్ ముఖియా, బసంతి ఆర్తిలను అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి 710 క్యారెట్ల వజ్రాలు, 1.420 కిలోల బంగారు ఆభరణాలు, 215 గ్రాముల వెండి, రూ.20 లక్షల నగదు, 24 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ.. మొత్తం రూ.5 కోట్ల విలువైన సొత్తును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడే

హిమాయత్‌నగర్ చోరీ కేసులో నిందితులు నేపాల్ సరిహద్దులో ఉన్న బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా బిరాహుల్ గ్రామానికి చెందిన కరుడుగట్టిన నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ధనవంతుల ఇళ్లల్లో పనికి చేరి పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడతారని సీపీ తెలిపారు. దోపిడి కేసులో నిందితుడైన మొలహు ముఖియా

గతేడాది దోమలగూడ పీఎస్ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్యచేసి కోటి రూపాయలు చోరీ చేసినట్టు తెలిపారు. కాగా బిరాహుల్ గ్రామంలోని ముఖియా కమ్యూనిటీ చెందిన కొన్ని కుటుంబాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించినట్టు సీపీ తెలిపారు.

కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఈస్ట్ జోన్ డీసీపీ బాల స్వామి, ఏ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఏ శ్రీనివాసరావు, జే నర్సయ్య, ఏసీపీ శంకరయ్య, నారాయణగూడ సీఐ, ఇతర పోలీసు అధికారులను సీపీ సీవీ ఆనంద్ అభినందించి, రివార్డు అందజేశారు.