ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై ఎస్ఓటి బృందం దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో 9 మంది కలిసి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటి బృందం, స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన 9 మంది వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించి అనంతరం తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద నుండి రూ.71,990/- నగదు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ కౌన్సిలర్లు, యాచారంకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.