calender_icon.png 20 January, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్థి గ్యాంగ్ కీలక సభ్యుల అరెస్టు

07-07-2024 02:30:56 AM

  • పరారీలో మరో ఇద్దరు దుండగులు 
  • రూ.17 వేలు, వెండి పట్టీలు స్వాధీనం 
  • నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్ వెల్లడి

నల్లగొండ, జూలై 6 (విజయక్రాంతి): దారి దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు, క్రూరంగా హత్యలకు పాల్పడే దేశంలోనే అత్యంత ప్రమాదకర ముఠాగా పేరొందిన పార్థి గ్యాంగ్‌లోని ఇద్దరు కీలక సభ్యులను నల్లగొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 17 వేలు,  వెండి పట్టీలు, చోరీలకు వినియోగించే స్క్రూ డ్రైవర్, కత్తెరలు, టార్చ్‌లైట్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. మే 18న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రు మండలం చెట్లవారిపురానికి చెందిన డీసీఎం డ్రైవర్ కొల్లూరి రాజవర్ధన్ హైదరాబాద్‌లో ఇంటి సామాను అన్‌లోడు చేసి తిరుగు ప్రయాణంలో కట్టంగూర్ మండ లం ఎరసానిగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారి వెంట వాహనం నిలిపి నిద్రిస్తున్నాడు.

గుర్తు తెలియని వ్యక్తులు అతడి కాళ్లు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఈ కేసు ఛాలెంజ్‌గా మారడంతో గతంలో రహదారిపై జరిగిన దొంగతనాలు, హత్యల తీరును విశ్లేషించి ఇది పార్థి గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో దుండగు లను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 5న తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. విచారించగా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం వద్ద జరిగిన డీసీఎం డ్రైవర్ హత్యతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై పలు దోపిడీలకు పాల్పడినట్టు అంగీకరించారు. నలుగురు ముఠాగా ఏర్పడి ఈ అకృత్యాలకు ఒడిగినట్టు ఒప్పుకొన్నారు.

పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇందాపూర్‌కు చెందిన అప్ప పాండురంగా, శుభం అశోక్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని అహ్మాద్‌నగర్, షోలాపూర్ జిల్లాలకు చెందిన మరో ఇద్దరు కశ్మీర్ శశిపాల్ భోంస్లే, అధేష్ అనిల్ ఖలే పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లిందని తెలిపారు. నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలతోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా 32 నేరాలకు పాల్పడిందని వెల్లడించారు.

వీటిలో ఓ హత్య, 6 దోపిడీలు, 7 చైన్ స్నాచింగ్, 8 బైక్ దొంగతనాలు, 10 ఇండ్ల తలుపులు పగులగొట్టిన కేసులున్నాయని వివరించారు. ఆరు బయట నిద్రిస్తున్న వారి మెడలోంచి బంగారం లాక్కెళ్లం, రహదారి వెంట వెళ్తున్న వారిని అడ్డగించి దోపిడీ చేయడం ప్రతిఘటిస్తే దారుణం హతమార్చడం ఈ ముఠా నైజమని ఎస్పీ వెల్లడించారు. దోపిడీ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్సై సైదాబాబుతోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.