కూకట్‌పల్లి, నవంబర్ 1 : అక్రమంగా హాష్ ఆయిల్ ను రవాణా చేస్తున్న ముగ్గురిని సైబరాబాద్ ఎస్‌వోటీ, బాలా నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురేష్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పట్టుబడిన నిందితుల్లో సభావత్ సుమన్, రమావత్ లాలు, కేతావత్ విజయ్ కుమార్ ఉన్నారు.
వీరిలో ప్రధాన నిందితుడు సభావత్ సుమన్‌ను 2021లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని గొలుగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నం జైల్లో ఉన్న సమయంలో సుమన్‌కు ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు జైలు నుంచి విడుదలైన అనంతరం గంజాయి, హాష్ ఆయిల్‌ను విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు.
వీరిద్దరు కలిసి ఎన్డీపీఎస్ కేసులో మూడుసార్లు జైలుకు వెళ్లిన కేతావత్ విజయ్ కుమార్‌ను పరిచయం చేసుకొని గంజాయి కొనుగోలుకు కస్టమర్లను వెతకమని కోరారు. అదేవిధంగా కిరణ్ ఒడిశా నుంచి హషీష్ ఆయిల్‌ను నగరానికి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో కిరణ్ వారికి 2,590 లీటర్ల హషీష్ ఆయిల్‌ను డెలివరీ చేశాడు.
అనంతరం కేతవత్ విజయ్ కుమార్ సమక్షంలో అక్టోబర్ 31వ తేదీన సభావత్ సుమన్, రమావత్ లాలు బాలానగర్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో కస్టమర్ల కోసం వేచి ఉండగా ఎస్‌ఓటీ సైబరాబాద్, బాలానగర్ పోలీసుల కంటపడ్డారు. పోలీసులు వారిని అదుపులో తీసుకోగా వారి వద్ద నుంచి సుమారు రూ.12,95,000 విలువ చేసే 2.590 లీటర్ల హాష్ ఆయిల్, పల్సర్ బైక్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.