- పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- పలువురు బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
- తిరుమలగిరి రోడ్డుపై బైఠాయించి మాజీ సర్పంచ్‌లకు
- మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు పోరుబాటు పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి బయల్దేరారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
గ్రామాల నుంచి హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి తిరుమలగిరి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, హరీశ్‌రావు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసి నిర్భంధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సర్పంచ్‌ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అప్పులు చేసి భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశారన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్‌గా నిలిచిందన్నారు. ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచ్‌ల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు.
మంచి పనులు చేసిన సర్పంచ్‌లకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని, కానీ పేద సర్పంచ్‌లు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా అని నిలదీశారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిందని, పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదన్నారు.
నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు వచ్చి మొర పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచ్‌లను చర్చలకు పిలవాలని, వెంటనే పెండిండ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ‘లక్షా 50 వేల కోట్లతో మూసీ బాగు చేస్తా అంటున్నావు. కానీ, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచ్‌లకు ఎందుకు శిక్ష వేస్తున్నావు.
సర్పంచ్‌ల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచ్‌ల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్నారు. మేము వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నారు. అరెస్టున వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. నిన్న గాక మొన్న బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు.
వీరికి ఎందుకు ఇవ్వడం లేదు. సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వెంటనే సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి’ అని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, హరీష్‌రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనచారి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తిరుమలగిరి పీఎస్‌కు తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు గేట్లకు తాళాలు వేసి, వారిని అదుపు చేశారు.