calender_icon.png 20 September, 2024 | 3:18 PM

రాష్ట్రవ్యాప్తంగా రైతుల అరెస్టు

20-09-2024 02:26:24 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ చేయాలని రైతు సంఘాలు ఛలో ప్రజాభవన్‌కు పిలుపునివ్వడంతో అక్కడి రాకుండా పోలీసులు ఒకరోజు ముందే ఎక్కడిక్కడే రైతులను అరెస్టు చేశారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్ల రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. గురువారం వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన రైతులను ఆయా ప్రాంతాల్లో అదుపులోకి తీసుకోగా  సాయంత్రం వరకు స్టేషన్‌ల్లో నిర్భందించారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడితే అరెస్టులు చేయడాన్ని వారు ఖండించారు. 

ఆందోళన చేసే హక్కు లేదా : కేటీఆర్

తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చే పోలీసులు అడ్డుకోవడం సరి కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పోలీసుల నిర్భందకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైతున్నారని, అక్రమంగా అరెస్టు చేసిన రైతులందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధ లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభు త్వం తలవంచక తప్పదన్నారు. 

రుణమాఫీ అమలు చేయలేదని ప్రశ్నించిన రైతులను ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వరకు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు అమలు చేయడకపోవడం సరికాదన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ పాలకులు నిలబెట్టుకోవాలన్నారు. సీఎం వ్యవహారం పిల్లికి చెలగాటం, రైతులకు ప్రాణ సంకటంగా మారిందన్నారు.