calender_icon.png 16 November, 2024 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల అరెస్టు

26-09-2024 01:33:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఫుడ్‌సేఫ్టీ, హ్యుమన్ రైట్స్ అధికారులుగా చలామణి అవుతూ నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడంతోపాటు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు జీహెచ్ ఎంసీ (హెల్త్) అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు.

వివరాలు.. మలక్‌పేట్‌కు చెందిన బొగ్గుల సునీత(50), సికింద్రాబాద్‌కు చెందిన నీలి విజయలక్ష్మి(58) ఇద్దరూ కలిసి ఫుడ్‌సేఫ్టీ, హ్యుమన్ రైట్స్ అధికారులుగా చెప్పుకుంటూ ఇటీవల వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు అందాయని, దీని ఆధారంగా సంబంధిత మహిళలు ఈనెల 23న అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లను సందర్శిస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు ఆయా ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లను అప్రమత్తం చేశారు.

ఈ మేరకు సుచిత్ర ఎక్స్‌రోడ్డు వద్ద ఓ రెస్టారెంట్ నిర్వాహకులు బుధవారం సంబంధిత మహిళలను పట్టుకొని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.