హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): నడుస్తున్న బస్సులో మహిళ పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడు ఈర్ల కృష్ణబాబు ను అరెస్టు చేశారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై లైంగిక దాడి చేశాడని మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వివరాలను వెల్లడించారు. ఓయూ సమీపం లో పోలీసులు బస్సును సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ సిద్ధయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. అప్పటికే ప్రధాన నిందితుడు కృష్ణబాబు పరారు కాగా, గాలింపు చేపట్టి మంగ ళవారం రాత్రి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కృష్ణబాబుది నెల్లూరు జిల్లా కాగా సిద్ధయ్య ప్రకాశం జిల్లాకు చెందినవాడని తెలిపారు. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్ధయ్య బస్సు డ్రైవ్ చేశాడని, కృష్ణబాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడిం చారు. బాధితురాలి భర్త ఏడేళ్ల క్రితం మరణించాడని డీసీపీ పేర్కొన్నారు.